ఇక అందరూ ‘ఆమె’నే.. ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ బిల్లును సిద్ధం చేస్తున్న కేంద్రం

  • ‘బేటీ బచావో.. బేటీ పడావో’ స్ఫూర్తిగా బిల్లును తీసుకొస్తున్న కేంద్రం
  • ఇకపై లింగం ఏదైనా అందరినీ ‘ఆమె’గానే సంబోధించేలా బిల్లు
  • శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు
‘బేటీ బచావో.. బేటీ పడావో’ స్ఫూర్తిగా కేంద్రం ప్రభుత్వం ఓ సరికొత్త బిల్లును తీసుకొస్తోంది. ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ పేరుతో ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లో తీసుకురానున్నారు. ఈ ముసాయిదా బిల్లులో స్త్రీ, పురుష, నంపుంసక లింగాలకు ఆమె, ఆమెను (షి/హర్) అనే పద ప్రయోగం చేశారు. వారు ఏ వర్గానికి చెందిన వారైనా అంటే.. స్త్రీ, పురుష, నపుంసక లింగాల్లో ఎవరైనప్పటికీ ఆ వ్యక్తిని సంబోధించేటప్పుడు ఆమె, లేదంటే ఆమెను అనే పదాలను ఉపయోగించాలని ఈ ముసాయిదా బిల్లు చెబుతోంది. మహిళలను సాధికారులను చేయాలన్న ప్రభుత్వ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ మాటలను ఉపయోగించినట్టు ఈ ముసాయిదా బిల్లు చెబుతోంది.

ఈ బిల్లు ఆన్‌లైన్ లింకును కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడే సంస్థలను అదుపులో పెట్టేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తున్నట్టు మంత్రి తెలిపారు. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తే గరిష్ఠంగా రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. డేటా ప్రొటెక్షన్ బిల్లును 2019లోనే కేంద్రం తీసుకొచ్చింది. అయితే, విపక్షాలు వ్యతిరేకించడంతో బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. పరిశీలించిన కమిటీ బిల్లులో 81 సవరణలను ప్రతిపాదించింది. దీంతో వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసి ‘డిజిటల్ పర్సనల్ ప్రొటెక్షన్ బిల్-2022’ పేరుతో శీతాకాల సమావేశాల్లో తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.


More Telugu News