టీడీపీ నేత నారాయణ నివాసానికి వెళ్లి వాంగ్మూలం తీసుకున్న సీఐడీ అధికారులు

  • అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ వ్యవహారం
  • ఇటీవల నారాయణకు నోటీసులు
  • హైకోర్టును ఆశ్రయించిన నారాయణ
  • తనకు శస్త్రచికిత్స జరిగిందని తెలిపిన వైనం
  • నారాయణను ఇంటివద్దే విచారించాలన్న హైకోర్టు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ సీఐడీ అధికారులు నేడు హైదరాబాదులోని నారాయణ నివాసానికి వెళ్లారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కు సంబంధించి ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. న్యాయవాదుల సమక్షంలో నారాయణ నుంచి వివరణ తీసుకున్నారు.

నారాయణ టీడీపీ ప్రభుత్వ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ వ్యవహారంలో ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు మాజీమంత్రి నారాయణకు నోటీసులు ఇవ్వగా, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 

ఇటీవల తనకు శస్త్రచికిత్స జరిగిందని, తన వయసు కూడా పైబడిందని నారాయణ కోర్టుకు విన్నవించారు. దాంతో, సీఐడీ ఎదుట హాజరుకావడంపై నారాయణకు మినహాయింపు ఇచ్చింది. నారాయణను హైదరాబాదులో ఆయన నివాసంలోనే విచారించాలని హైకోర్టు సీఐడీకి నిర్దేశించింది. ఓ న్యాయవాది సమక్షంలో ఈ ప్రక్రియ జరగాలని స్పష్టం చేసింది.


More Telugu News