పానీ పూరీ తిని రోజులు నెట్టుకొచ్చాను: అమితాబ్ బచ్చన్

  • కోల్ కతాలో పనిచేసే సమయంలో రూ.300 వేతనం
  • అప్పట్లో పానీ పూరీ ఒకటే చౌకగా వచ్చేదన్న బిగ్ బీ
  • అది తిని ఆకలి తీర్చుకున్నట్టు వెల్లడించిన అమితాబ్
బాలీవుడ్ నట దిగ్గజాల్లో ఒకరైన అమితా బచ్చన్ గురించి దేశ ప్రజలు అందరికీ తెలుసు. నటుడిగా రెండు చేతులా సంపాదిస్తూ కెరీర్ లో విశ్రాంతి లేకుండా పనిచేసిన రోజులు చాలానే ఉన్నాయి. మధ్యలో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపంలో భారీ అప్పుల పాలయ్యారు. అయినా, మనోస్థైర్యంతో ఆయన మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టి సంపదను సృష్టించుకున్నారు. ఇదంతా ఆయన లైఫ్ జర్నీ. 

మరి నటన తొలినాళ్లలో ఆయన పానీ పూరీలను తిని నెట్టుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి 14వ సిరీస్’ లో భాగంగా వెల్లడించారు. కోల్ కతాకు చెందిన కంటెస్టెంట్ గార్గీ సేన్ రాగా, ఆమెకు ఆహ్వానం పలికిన అమితాబ్ కెరీర్ మొదట్లో కోల్ కతాలో తాను గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. 

డిస్ ప్లే మీద ఒక మ్యూజియం ఫొటోను ప్రదర్శించగా, అది కోల్ కతాలోని విక్టోరియా మెమోరియల్ అని కంటెస్టెంట్ గార్గీసేన్ చెప్పారు. ఆ వెంటనే అమితాబ్ తన స్టోరీ షేర్ చేశారు. ‘‘విక్టోరియా మెమోరియల్ ముందు ప్రపంచంలోనే ఉత్తమ పానీపూరీ లభించే ప్రదేశం ఒకటి ఉంది. నెలకు కేవలం రూ.300-400 సంపాదించే నా లాంటి వారికి అదే చిరునామా. కోల్ కతాలో పనిచేసిన సమయంలో నేను ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొన్నా. అప్పుడు పానీ పూరీ ఒక్కటే చాలా చౌకగా వచ్చేది. అణా, చారాణ పెడితే పానీ పూరి వచ్చేది. అవి ఎంతో రుచిగా ఉండేవి. వాటితో నా ఆకలి తీర్చుకునే వాడిని’’ అని అమితాబ్ వివరించారు.


More Telugu News