లైగర్ సినిమాకు పెట్టుబడులు.. ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్, చార్మి

  • లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు ఉన్నాయని కాంగ్రెస్ నేత ఫిర్యాదు
  • సమగ్రంగా విచారణ జరిపించాలని కోరిన బక్క జడ్సన్
  • లైగర్, జనగణమన సినిమాల పెట్టుబడులపై ఈడీ ఆరా
  • పూరీ, చార్మిలను వేర్వేరుగా పది గంటలకు పైగా విచారించిన అధికారులు
  • అవసరమైతే మరోమారు రావాల్సి ఉంటుందన్న ఈడీ
‘లైగర్’ సినిమా పెట్టుబడులకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్‌ నిన్న ఈడీ విచారణకు హాజరయ్యారు. అవసరమైన పత్రాలతో బషీరాబాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న వీరిద్దరినీ వేర్వేరుగా 10 గంటలకుపైగా విచారించారు. లైగర్ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు? నిధుల సమీకరణ, నిర్మాణ ఖర్చులు, వచ్చిన ఆదాయం, పంపకాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అవసరమైతే మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని వారికి చెప్పి పంపించారు.

లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెట్టుబడులు పెట్టారని, ఆమెకు చెందిన డబ్బు విదేశాల నుంచి లైగర్ నిర్మాతలకు అందిందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే, రియల్ ఎస్టేట్ సంస్థ మై హోం గ్రూప్ విజయ్ దేవరకొండతో జనగణమన సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తోందని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలు విద్యాసంస్థల్లోనూ కవిత పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. లైగర్ సినిమా పెట్టబడులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్, చార్మిలకు నోటీసులు ఇచ్చిన అధికారులు గురువారం విచారణకు పిలిచారు. ఈ సందర్భంగా లైగర్ పెట్టుబడులకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించిన ఈడీ.. ‘జనగణమన’ సినిమా పెట్టుబడుల గురించి కూడా ఆరా తీసినట్టు సమాచారం.


More Telugu News