గురుగ్రామ్ లో ఈ 11 రకాల కుక్కల జాతులపై నిషేధం... ఎందుకంటే..!

  • గురుగ్రామ్ లో కుక్కలంటే హడలిపోతున్న స్థానికులు
  • పెంపుడు కుక్కలు సైతం కరుస్తున్న వైనం
  • ఓ మహిళకు తీవ్రగాయాలు
  • వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు
  • మున్సిపల్ కార్పొరేషన్ కు ఫోరం ఆదేశాలు
దేశ రాజధాని ఢిల్లీకి చేరువలో ఉండే గురుగ్రామ్ లో ఇటీవల కుక్క కాటు ఘటనలు అధికమయ్యాయి. గురుగ్రామ్ వాసులు కుక్కలంటేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. వీధి కుక్కలు సరేసరి... ఆఖరికి పెంపుడు కుక్కలు కూడా ప్రజలను కరుస్తున్న ఘటనలు నమోదయ్యాయి. 

ఈ నేపథ్యంలో, కుక్క కాటుకు గురై తీవ్రగాయాలపాలైన ఓ మహిళ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా, ఫోరం కీలక నిర్ణయం తీసుకుంది. 11 రకాల విదేశీ కుక్కలను పెంచుకోవడంపై నిషేధం ప్రకటించాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్పష్టం చేసింది. 

ఆ కుక్కల జాతులు ఏవంటే... 1.అమెరికన్ బుల్ డాగ్ 2. అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్స్ 3. డాగో అర్జెంటీనో 4. రాట్ వీలర్ 5. బోయర్ బోయెల్ 6. ప్రెసా కనారియో 7. నీపోలీషియన్ మాస్టిఫ్ 8. ఉల్ఫ్ డాగ్ 9. కేన్ కోర్సో 10. బాండాగ్ 11. ఫిలా బ్రసీలీరో. 

ఇవి ఎంతో ప్రమాదరకరమైన విదేశీ జాతులు అని ఫోరం అభిప్రాయపడింది. గురుగ్రామ్ వాసులు ఈ 11 జాతుల్లో దేన్ని కలిగి ఉన్నా, దాని లైసెన్స్ రద్దు చేయాలని ఫోరం నిర్దేశించింది. ఆయా కుక్కలను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పేర్కొంది. అంతేకాదు, కుక్క కాటుకు గురైన మహిళకు రూ.2 లక్షల పరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది. కాగా, ఆ మహిళను కరిచిన కుక్క డాగో అర్జెంటీనో జాతికి చెందినదిగా గుర్తించారు. 

ఇక, పెంపుడు కుక్కలను మలవిసర్జన కోసం వీధుల్లోకి తీసుకురావొద్దని వాటి యజమానులను ఆదేశించింది. అందుకోసం ప్రత్యేకంగా మలవిసర్జన సంచులను ఉపయోగించాలని స్పష్టం చేసింది.


More Telugu News