రూ. 19.5 కోట్లు పలికిన ఫుట్​ బాల్ బంతి.. ప్రత్యేకత ఇదే!

  • సాకర్ దిగ్గజం మారడోనా 'హ్యాండ్ ఆఫ్ గాడ్' గోల్ చేసిన ఫుట్ బాల్ కు భారీ ధర
  • 1986 ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ పై ఈ గోల్ కొట్టిన మారడోనా
  • 2020లో కన్నుమూసిన సాకర్ మాంత్రికుడు
అర్జెంటీనా సాకర్‌ దిగ్గజం, దివంగత డీగో మారడోనా 1986 ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై చేసిన ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ మ్యాచ్ లో మారడోనా చేయి తగిలిన ఓ బాల్‌ గోల్‌ పోస్ట్‌లో పడింది. రిఫరీగా వ్యవహరించిన అలీ బిన్‌ నాసర్‌ దీన్ని గుర్తించకుండా గోల్‌ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇది ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌ గోల్‌’గా చరిత్రలో నిలిచిపోయింది. మారడోనా గోల్ చేసిన ఆ బంతి ఇప్పుడు వేలంలో ఏకంగా రూ. 19.5 కోట్లకు అమ్ముడైంది. 

నాటి మ్యాచ్ లో రిఫరీగా ఉన్న అలీ బిన్ నాసర్ దగ్గరే ఈ బంతి ఉండిపోయింది. ట్యునీషియాకు చెందిన అలీ బిన్‌ బంతిని వేలంలో పెట్టాలని నిర్ణయించారు. లండన్‌లోని గ్రాహమ్‌ బడ్‌ వేలం సంస్థ నిర్వహించిన వేలంలో ఈ బంతి భారీ మొత్తానికి అమ్ముడైంది. కాగా, హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌ గోల్‌ చేసేప్పుడు మారడోనా వేసుకున్న జెర్సీ ఈ మేలో జరిగిన వేలంలో దాదాపు రూ. 75 కోట్లు పలికింది. తన ఆటతో సాకర్ అభిమానులను ఉర్రూతలూగించిన మారడోనా 2020లో మరణించాడు.


More Telugu News