చలి ప్రభావం పెరుగుతోంది.. జాగ్రత్తగా ఉండండి: అధికారుల హెచ్చరిక
- మున్ముందు మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం
- వృద్ధులు, చిన్నాారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
- సీజనల్, శ్వాసకోశ సమస్యలు వేధించే అవకాశం ఉందన్న అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం పెరుగుతోందని, సీజనల్ వ్యాధులతోపాటు శ్వాసకోశ సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట చలిగాలుల ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా చలి కూడా పెరుగుతోంది. దీనికితోడు పొగమంచు కూడా విపరీతంగా పడుతోంది. దీంతో రహదారులపై ప్రయాణానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో చలికి జనం వణుకుతున్నారు. సాయంత్రం ఆరు గంటలకే చలి మొదలై ఉదయం 9 గంటల వరకు గజగజలాడిస్తుండడంతో భానుడు బయటకు వచ్చే వరకు జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి సంకోచిస్తున్నారు.
ఏపీలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. చింతపల్లి, పాడేరు, మినుములూరు, అరకలోయలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని, వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.