వణుకుతున్న చింతపల్లి.. అమాంతం పడిపోయిన ఉష్ణోగ్రతలు

  • చింతపల్లిలో నిన్న 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
  • మొన్న 13 డిగ్రీలుగా నమోదు
  • మున్ముందు మరింత తగ్గుతాయంటున్న అధికారులు
ఏపీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణుకుతున్నాయి. గత రెండు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిన్న 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం 13 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు బుధవారం ఒక్కసారిగా పడిపోవడంతో జనం చలితో గజగజలాడుతున్నారు. 

ఇక, పాడేరు మండలంలోని మినుములూరు కాఫీ బోర్డులో 10.1 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాదు, తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మన్యం మొత్తం పొగమంచుతో తడిసి ముద్దవుతోంది. కన్ను చించుకున్నా పరిసరాలు కనిపించడం లేదు. దీంతో ఉదయం బయటకు రావాలంటనే జనం భయపడుతున్నారు. కాగా, మన్యంలో ఉష్ణోగ్రతలు మున్ముందు మరింత కనిష్ఠానికి పడిపోయే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు.


More Telugu News