బస్సును వెంటాడిన ఏనుగు.. రివర్స్ గేర్‌లో 8 కిలోమీటర్లు వెనక్కి నడిపిన డ్రైవర్.. వీడియో ఇదిగో!
- కేరళలోని అటవీ ప్రాంతంలో ఘటన
- భయంతో హడలిపోయిన బస్సులోని 40 మంది ప్రయాణికులు
- ఇది తనకు మర్చిపోలేని ఘటన అన్న డ్రైవర్
- రెండేళ్లుగా ఆ ఏనుగు ఇలాగే భయపెడుతోందంటున్న స్థానికులు
అటవీ మార్గం గుండా వెళ్తున్న ఓ బస్సును ఏనుగు వెంబడించడంతో మరో మార్గం లేని డ్రైవర్ బస్సును 8 కిలోమీటర్లు వెనక్కి నడిపాడు. అంతదూరం బస్సును వెంబడించిన ఏనుగు ఆ తర్వాత అడవిలోకి వెళ్లిపోవడంతో అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కేరళలో జరిగిందీ ఘటన. చాలకుడి నుంచి వాల్పరాయ్ మార్గంలో ఓ ప్రైవేటు బస్సు 40 మంది ప్రయాణీకులతో వెళ్తోంది. కొంతదూరం వెళ్లాక బస్సుకు ఓ ఏనుగు ఎదురుపడింది. అది తప్పుకుంటుందని భావించినా ఆ పని జరగకపోగా బస్సును అడ్డగించింది. అంతేకాకుండా ఆగ్రహంతో పరుగులు తీస్తూ బస్సువైపు దూసుకొచ్చింది. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు.
బస్సును వెనక్కి నడపమని డ్రైవర్‌ను కోరారు. డ్రైవర్ అలాగే చేశాడు. ఇరుగ్గా, వంకరగా ఉన్న ఆ రోడ్డులోనే అంబలాపర నుంచి అనక్కయాం వరకు దాదాపు 8 కిలోమీటర్ల పాటు బస్సును అలాగే రివర్సు గేరులో వెనక్కి నడిపాడు. అక్కడి వరకు బస్సును వెంటాడుతూనే వచ్చిన ఏనుగు ఓ గ్రామం వద్ద అడవిలోకి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఏనుగు పేరు కబాలి అని రెండేళ్లుగా అది ఇలాగే చేస్తోందని స్థానికులు పేర్కొన్నారు. ఇది తనకు మర్చిపోలేని ఘటన అని, బస్సులోని అందరూ భయపడిపోయారని డ్రైవర్ అంబుజాక్షన్ పేర్కొన్నారు. బస్సును వెనక్కి నడపడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.