నేను తలుచుకుంటే నిర్దాక్షిణ్యంగా అణచివేస్తా: కోడుమూరులో చంద్రబాబు

  • కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • కోడుమూరులో రోడ్ షో
  • భారీగా తరలివచ్చిన జనం
  • ఉత్సాహంగా ప్రసంగించిన టీడీపీ అధినేత
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కోడుమూరులో చంద్రబాబు రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతి, అక్రమాలకు ప్రతిరూపం జగన్ రెడ్డి అని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది తెలుగుదేశం పార్టీయేనని వెల్లడించారు. ఈ మూడేళ్లలో ఒక్క పని అయినా చేశారా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. 

రోడ్లపై గుంతలు పడితే మట్టి వేయలేని సీఎం మూడు రాజధానులు కడతారా? అంటూ నిలదీశారు. ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త సీఎం జగన్ రెడ్డి అంటూ విమర్శించారు. 

"ఈ ముఖ్యమంత్రి ఒక జాబ్ కాలెండర్ ఇచ్చాడా? ఏంచేశాడు ఈ ముఖ్యమంత్రి? అందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు. ఎవరన్నా గట్టిగా నిలదీస్తే పోలీసులు మీ ఇంటికి వస్తారు... పోలీసులకు న్యాయం చేశాడా అంటే అదీ లేదు. ఇప్పుడీ పోలీసుల పొట్ట కొడుతున్నాడు ఈ జగన్ రెడ్డి. పోలీసులూ... మీ డీఏలు, పీఎఫ్ లు వస్తున్నాయా? మీక్కూడా ఏమీ రావడం లేదు. మీరు కూడా ఈ రాష్ట్రంలో భాగమే. ఓసారి నేను గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే రూ.18 కోట్లు వచ్చారు. నేను మళ్లీ మాట్లాడితేనే మీ డబ్బులు వస్తాయి... ఆ విషయం పోలీసులు గ్రహించాలి. పోలీసులు ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. 

రాష్ట్రంలో సీఐడీ డిపార్ట్ మెంట్ ఓ పనికిమాలిన దద్దమ్మ శాఖలా మారింది. ఎవరైనా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ముందు వీళ్లు వస్తారు. వాళ్లకి చట్టం లేదంట! తప్పు చేసిన అధికారులను వదిలేది లేదు... వారిని బోనెక్కించే బాధ్యత నాది. జగన్ ను నమ్ముకుంటే జైలుకు పోతారు... నన్ను నమ్ముకుంటే రాచబాటలో నడుస్తారు. మీకు బంగారు భవిష్యత్ లభిస్తుంది.

కాకినాడ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ ఎగిరెగిరిపడ్డాడు... కారు డ్రైవర్ ను చంపి, ఇంటికి పంపించి అంత్యక్రియలు చేసుకోమన్నాడు. ఆ ఎమ్మెల్సీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, పోలీసులు ప్రయత్నించారు కానీ అతడికి బెయిల్ కూడా రాలేదు. జగన్ మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. అటు బాబాయ్ ను చంపారు... ఈ కేసు వేరే రాష్ట్రానికి మార్చారు. 

ఎగిరెగిరిపడేవారికి వార్నింగ్ ఇస్తున్నా, వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నా... ఖబడ్దార్, జాగ్రత్తగా ఉండండి... రౌడీలను పరిగెత్తించిన పార్టీ టీడీపీ... ముఠాలను రూపుమాపిన పార్టీ టీడీపీ... మతవిద్వేషాలు కట్టడి చేసిన పార్టీ, తీవ్రవాద సమస్యలు పరిష్కారం చేసిన పార్టీ టీడీపీ... నేను తలుచుకుంటే ఈ రౌడీ రాజకీయాలు అణచలేనా తమ్ముళ్లూ! దయాదాక్షిణ్యాలు లేకుండా అణచివేస్తా. వడ్డీతో సహా వడ్డిస్తాం" అని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

"ఎవడో పనికిమాలిన వాడు మా కార్యకర్తను కొట్టాడంట... వాడికి చెబుతున్నా... నిన్ను కాదు, నిన్ను పంపించిన వాడ్ని కూడా లాక్కొస్తా. డోన్ లో ఒక పనికిమాలిన అప్పుల మంత్రి ఉన్నాడు. నా కార్యకర్త ఇంటి గోడను కూల్చివేశారు. నీ ఇల్లును కూల్చాలంటే నాకు ఒక్క నిమిషం పని. నీ ఇల్లే కాదు... నీ జీవితం కూడా కూలిపోతుంది. న్యాయం ప్రకారం నడుచుకోండి. లేకపోతే మీ గుండెల్లో నిద్రపోతా. 

పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ద్రోహులైన పోలీసుల కథ నేను తేలుస్తా... మంచి పోలీసులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ నేను సభ నిర్వహించకపోయినా ఇంతమంది వచ్చారంటే, సభ ఏర్పాటు చేసుంటే కోడుమూరు పట్టేది కాదు. రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ గాలి వీస్తోంది... ఈ గాల్లో వైసీపీ కొట్టుకుపోతుంది" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.


More Telugu News