చెన్నై తనను అట్టిపెట్టుకోవడంపై జడేజా స్పందన ఇదీ..

  • అంతా బాగానే ఉందంటూ జడేజా ట్వీట్
  • తిరిగి ప్రారంభించు అంటూ కొటేషన్
  • ఇంత కాలం నడిచిన ప్రచారాలకు చెక్
రవీంద్ర జడేజా మొత్తానికి చెన్నై జట్టుతోనే కొనసాగనున్నాడు. 2023 సీజన్ కు ముందు విడుదల చేసే ఆటగాళ్ల వివరాలను అన్ని ఫ్రాంచైజీలు వెల్లడించగా.. చెన్నై సూపర్ కింగ్స్ జడేజాను విడుదల చేయలేదు. నిజానికి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో.. జడేజా ఇక చెన్నైకు దూరమైనట్టేనని దాదాపు ఎక్కువ మంది భావించారు. ఆ అంచనాలను సీఎస్కే తలకిందులు చేసి, సుదీర్ఘకాలంగా తమతో కలిసి నడుస్తున్న జడేజా వైపు మొగ్గు చూపించింది.

దీనిపై జడేజా వెంటనే ట్విట్టర్ లో స్పందించాడు. ‘అంతా బాగుంది’ అంటూ పక్కనే పసుపు రంగు హృదయం ఎమోజీ వేసి, ఆ వెంటనే ‘తిరిగి మొదలు పెట్టు’అని ట్వీట్ ఇచ్చాడు. 2022 సీజన్ లో సీఎస్కేను ఒక మ్యాచ్ లో ఒంటి చేత్తో గెలిపించిన ధోనీకి తలవంచి నమస్కరిస్తున్న ఫొటోను పోస్ట్ చేశాడు. అంటే తనకు, సీఎస్కేకు మధ్య ఇక ఎలాంటి సమస్యల్లేవంటూ, మళ్లీ ఆటను మొదలు పెట్టడమే మిగిలి ఉందన్నట్టు అభిప్రాయం వెలిబుచ్చాడు.

43 ఏళ్ల వయసుకు చేరుకున్న మహేంద్రసింగ్ ధోనీ సీఎస్కే కెప్టెన్ గా తప్పుకునే ఆలోచనలో ఉన్నాడు. దీంతో 2022 సీజన్ లో జట్టును నడిపించే బాధ్యతను జడేజాకు సీఎస్కే అప్పగించింది. కానీ, జడేజా విఫలమయ్యాడు. లీగ్ దశలో వరుస ఓటములతో అతడ్ని తప్పించి ధోనీకే తిరిగి కెప్టెన్సీ అప్పగించాల్సి వచ్చింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో, లీగ్ దశ నుంచే చెన్నై నిష్క్రమించింది. 2021 సీజన్ ఛాంపియన్ అయిన సీఎస్కేకు ఇది మింగుడు పడని పరిణామం. దీంతో జడేజాకు, సీఎస్కేకు కొంత దూరం ఏర్పడింది. తాజా పరిణామంతో అదంతా సమసిపోయినట్టు తెలుస్తోంది.


More Telugu News