అప్పట్లో కృష్ణకి తప్ప ఆ గుర్రాన్ని ఎవరికీ ఇచ్చేవారు కాదట!

  • యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన కృష్ణ 
  • ఆ తరహా సినిమాల్లో గుర్రంపై ఛేజింగ్స్ కామన్ 
  • లక్ష్మి అనే గుర్రాన్ని కృష్ణ ఉపయోగించేవారు  
  • ఆయన కోసం ఆ గుర్రాన్ని మాత్రమే కేటాయించేవారట
తెలుగు తెరపై యాక్షన్ సినిమాలను పరుగులు తీయించిన హీరోగా కృష్ణ కనిపిస్తారు. అప్పట్లో యాక్షన్ సినిమాలంటే గుర్రాలు ఉండవలసిందే. వాటిపై ఛేజింగ్స్ ఉండవలసిందే. ఒక్కోసారి హీరో గుర్రంపై పాడుకుంటూ వచ్చే పాటలు కూడా ఉండేవి. కృష్ణ సినిమాల్లో ఇలాంటి పాటలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. గుర్రంపై పాటను చిత్రీకరించినా .. సన్నివేశాలను చిత్రీకరించినా అది ఒక ప్రమాదకరమైన విషయంగానే చెప్పుకోవాలి. 

ఎందుకంటే గుర్రం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు. పైగా షూటింగు సమయంలోని హడావిడికి అవి బెదిరిపోతూ ఉంటాయి. ఏదైనా ఇబ్బంది అయితే ఇప్పటి మాదిరిగా అప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. హీరోలకు ఆ గుర్రం అలవాటు ఉండాలి. లేదంటే చెప్పిన మాటను అది వినేదై ఉండాలి. అందువలన ఒకసారి ఒక హీరోకి ఒక గుర్రం అలవాటు పడితే దాదాపు ఆ గుర్రాన్ని ఆ హీరోకి వాడటానికే ప్రయత్నించేవారు. 

అప్పట్లో పులి గోవింద్ అనే వ్యక్తి సినిమా షూటింగులకు గుర్రాలను రెంట్ కి ఇచ్చేవాడట. అతని దగ్గరున్న 'లక్ష్మి' అనే గుర్రాన్ని మాత్రమే కృష్ణ తన సినిమాలలో ఉపయోగించేవారు. ఆ గుర్రాన్ని కృష్ణ గురించి మాత్రమే అట్టిపెట్టేవారు. ఒకవేళ వేరే ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే, కృష్ణగారిని అడిగి .. ఆయన షూటింగు డేట్లు తెలుసుకుని ఇచ్చేవారు. అప్పట్లో దానిని అందరూ కృష్ణగారి గుర్రం అనే పిలిచేవారట.



More Telugu News