21వ శతాబ్దపు ప్రపంచానికి భారత్ ఒక ఆశాకిరణం: ప్రధాని మోదీ

  • ఇండోనేషియాలో జీ20 దేశాల సదస్సు
  • ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ
  • భారత్ ప్రగతిపథంలో దూసుకెళుతోందని వెల్లడి
  • ప్రపంచంపై తనదైన ముద్రను వేస్తోందని వివరణ
ఇండోనేషియాలో జరుగుతున్న జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇండోనేషియాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి నేడు ఆయన ప్రసంగించారు. 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా నిలుస్తోందని అన్నారు. మునుపెన్నడూ లేనంత వేగంతో భారత్ ప్రగతిపథంలో దూసుకెళుతోందని, భారీ ప్రణాళికలను అమలు చేస్తోందని తెలిపారు. 

భారత్ ప్రతిభ, టెక్నాలజీ, ఆవిష్కరణలు, పారిశ్రామిక పురోభివృద్ధి ఇవాళ ప్రపంచ ఆర్థిక రంగంపై తమదైన ముద్రను వేశాయని వివరించారు. కరోనా సంక్షోభ సమయంలో ఔషధాలు, వ్యాక్సిన్ల విషయంలో భారత్ సాధించిన స్వయంసమృద్ధి మిగతా ప్రపంచానికి మేలు చేసిందని మోదీ పేర్కొన్నారు. 

అంతకుముందు, ఇండోనేషియాతో భారత్ ఘనమైన వారసత్వాన్ని, సంస్కృతిని పంచుకుంటోందని తెలిపారు. భారత్, ఇండోనేషియా దేశాలు కష్టసుఖాల్లోనూ మైత్రీబంధాన్ని కొనసాగించాయని మోదీ పేర్కొన్నారు. భారత్ లో అత్యంత ఘనమైన రామాలయం నిర్మితమవుతున్న వేళ, ఇండోనేషియా రామాయణ సంప్రదాయాన్ని కూడా తాము గుర్తుచేసుకుంటామని అన్నారు. 

అంతేకాదు, గాంధీ సిద్ధాంతాలను వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తూ, పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఇండోనేషియా సామాజిక ఉద్యమకారుడు ఆగస్ ఇంద్ర ఉదయన పేరును కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.


More Telugu News