మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు బెయిల్

  • సుఖేశ్ చంద్రశేఖర్ కేసులో జాక్వెలిన్ పై విచారణ
  • జాక్వెలిన్ పై మనీలాండరింగ్ ఆరోపణలు
  • షరతుతో కూడిన బెయిల్
  • కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని స్పష్టీకరణ
  • వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్
ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ కు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట లభించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. 

జాక్వెలిన్ పై దర్యాప్తు ఇప్పటికే ముగియడం, చార్జిషీటు కూడా దాఖలు చేయడం, పైగా ఆమెను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు ఇచ్చింది. ఈ సందర్భంగా జాక్వెలిన్ కు షరతు విధించింది. కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. 

వాదనల సందర్భంగా ఈడీ స్పందిస్తూ... జాక్వెలిన్ వద్ద కావాల్సినంత డబ్బు ఉందని, ఆమె విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కోర్టుకు తెలియజేసింది. కేవలం సరదా కోసమే జాక్వెలిన్ రూ.7.14 కోట్లు ఖర్చుచేసిందని ఈడీ వెల్లడించింది. 

రూ.200 కోట్ల మనీలాండరింగ్ వ్యవహారంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పలుమార్లు ఈడీ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ మోసాలతో సంపాదించిన డబ్బుతో జాక్వెలిన్ అనేక ప్రయోజనాలు పొందిందని ఈడీ చెబుతోంది. 

గతంలో ఈడీ విచారణ సందర్భంగా... సుఖేశ్ తనకు అనేక లగ్జరీ కార్లు బహూకరించాడని, లక్షల విలువ చేసే గుస్సీ, షేనెల్ బ్యాగులు, గుస్సీ జిమ్ దుస్తులు, లూయిస్ విటోన్ బూట్లు, ఖరీదైన ఆభరణాలు ఇచ్చాడని జాక్వెలిన్ వెల్లడించింది. అంతేకాదు, తాను ఎక్కడికి వెళ్లాలన్నా ప్రైవేటు జెట్ విమానాలు, విలాసవంతమైన హోటళ్లలో బస ఏర్పాటు చేసేవాడని వివరించింది.


More Telugu News