కేసీఆర్, హరీశ్ రావులకు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

  • తెలంగాణలో 8 బోధనాసుపత్రులను ప్రారంభించిన కేసీఆర్
  • వాటిలో సంగారెడ్డిలో ఒకటి ఏర్పాటు 
  • సంగారెడ్డికి బోధనాసుపత్రిని ఇచ్చినందుకు జగ్గారెడ్డి ధన్యవాదాలు
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై నిత్యం విమర్శలు సంధించే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) తాజాగా మంగళవారం వారిద్దరికీ ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం రాష్ట్రంలోని 8 జిల్లా కేంద్రాల్లో బోధనాసుపత్రులను కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటిలో సంగారెడ్డిలో నూతనంగా నిర్మించిన బోధనాసుపత్రి కూడా ఉంది. ఈ క్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే హోదాలో జగ్గారెడ్డి... బోధనాసుపత్రిని ప్రారంభించిన కేసీఆర్ కు, పనులు వేగంగా జరిగేలా చేసిన హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు కాక ముందు కూడా మెదక్ జిల్లా కేంద్రంగా సంగారెడ్డి కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాడు కూడా సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి... మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సంగారెడ్డికి బోధనాసుపత్రిని 2013లో మంజూరు చేయించుకున్నారట. అయితే ఆ తర్వాత సంగారెడ్డికి మంజూరైన బోధనాసుపత్రిని 2014 తర్వాత టీఆర్ఎస్ సర్కారు సిద్ధిపేటకు తరలించిందని జగ్గారెడ్డి ఆరోపించారు. సంగారెడ్డికి బోధనాసుపత్రి కోసం అసెంబ్లీలో పోరాటం చేశానని ఆయన అన్నారు. తన పోరాటం ఫలితంగా సంగారెడ్డికి కేసీఆర్ బోధనాసుపత్రిని ప్రకటించారని, నిధులు కూడా మంజూరు చేశారన్నారు. విపక్షంలో ఉన్న వాళ్లం కాబట్టి పనులు కాకుంటే కాలేదంటామని, అయితే అయ్యాయని చెబుతామని ఆయన అన్నారు.


More Telugu News