21 ఏళ్లపాటు వరుసగా సంక్రాంతి మొనగాడుగా నిలిచిన కృష్ణ!

  • గ్రామీణ నేపథ్యంలోని కథలను ఇష్టపడే కృష్ణ
  • పల్లెటూరు బుల్లోడు గా మెప్పించిన పాత్రలు  
  • సంక్రాంతి బరిలో తప్పనిసరిగా నిలిచిన సినిమాలు 
  • 21 ఏళ్ల పాటు గ్యాప్ లేకుండా సంక్రాంతికి వచ్చిన మొనగాడు
సంక్రాంతి పండుగకి .. తెలుగు సినిమాకి విడదీయరాని సంబంధం ఉంది. సంక్రాంతికి తమ సినిమా బరిలో ఉండాలనే ఆశ .. ఆశయం అప్పటి హీరోల్లో బలంగా కనిపించేది. అప్పట్లో సినిమాలకి గ్రామీణ స్థాయిలో ఆదరణ ఎక్కువగా ఉండేది. సంక్రాంతికి జనం చేతిలో డబ్బులు ఉంటాయి. సంక్రాంతి అనేది పల్లె పండగ .. బంధువుల సందడి పెరిగే పండగ. అందరూ కలిసి తప్పకుండా సినిమాలకి వెళ్లేవారు. అందువలన సంక్రాంతి సినిమాకి వసూళ్లు ఒక రేంజ్ లో ఉండేవి. 

ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. శోభన్ బాబు వీళ్లంతా సంక్రాంతికి తమ సినిమా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకునేవారు. ఇక కృష్ణ కూడా వారితో గట్టిగానే పోటీ పడ్డారు. గ్రామీణ నేపథ్యంలోని కథలను కృష్ణ ఎక్కువగా ఇష్టపడేవారు. పల్లెటూరు బుల్లోడుగా ముల్లుగర్ర చేతబట్టి, పొలం గట్లపై ఫైట్లను .. పాటలను చూపించినవారాయన. రైతు కుటుంబం నుంచి రావడం వలన ఆ తరహా పాత్రలను ఆయన చాలా నేచురల్ గా చేసేవారు. అలా వచ్చిన సినిమాలు దాదాపుగా ఆయనకి విజయాలను అందించేవి. 

ఎన్టీఆర్ కెరియర్ లో 33 సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. 31 సినిమాలతో ఆయన తరువాత స్థానంలో ఏఎన్నార్ కనిపిస్తారు. ఇక 21 సినిమాలను సంక్రాంతి బరిలో నిలిపిన హీరోగా కృష్ణ కనిపిస్తారు. అయితే 21 ఏళ్ల పాటు వరుసగా ప్రతి సంక్రాంతికి కృష్ణ కొత్త సినిమా థియేటర్లో ఉంటూ వచ్చింది .. అందువల్లనే అరుదైన ఆ రికార్డు కృష ఖాతాలోకి చేరిపోయింది. సంక్రాంతి మొనగాడుగా కృష్ణను నిలబెట్టింది.


More Telugu News