నేను ఆ మాట చెపితే కృష్ణగారు నవ్వేశారు: ముఖ్యమంత్రి కేసీఆర్

  • కృష్ణకు ఘన నివాళి అర్పించిన కేసీఆర్
  • వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయానన్న ముఖ్యమంత్రి
  • అల్లూరి సీతారామరాజు సినిమాను చాలా సార్లు చూశానని వెల్లడి
మన తెలుగు చలనచిత్ర సినీ రంగంలో సుప్రసిద్ధ సినీ నటులు కృష్ణగారు ఈరోజు మన మధ్య లేకుండా పోవడమనేది చాలా బాధాకరమైన విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని అన్నారు. కృష్ణగారి ఆతిథ్యం మేరకు ఈ ఇంటికి తాను చాలా సార్లు వచ్చానని తెలిపారు. విజయనిర్మల గారు కన్నుమూసినప్పుడు కూడా రావడం జరిగిందని చెప్పారు. కృష్ణకు నివాళి అర్పించిన అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎలాంటి అరమరికలు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కృష్ణ అని కేసీఆర్ అన్నారు. విలక్షణమైన నటుడని, పార్లమెంటు సభ్యులుగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. 'అల్లూరి సీతారామరాజు' గొప్ప సినిమా అని... ఈ సినిమా గురించి కృష్ణగారికి తాను చెపితే ఆయన నవ్వారని... కేసీఆర్ గారూ మీరు కూడా సినిమాలు చూస్తారా? అని ప్రశ్నించారని చెప్పారు. 'అల్లూరి సీతారామరాజు' సినిమాను తాను చాలా సార్లు చూశానని చెపితే... ఆయన ఎంతో సంతోషించారని అన్నారు. 

దేశభక్తిని పెంపొందించేలా సినిమాలను తీసిన కృష్ణగారి గౌరవార్థం వారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. మహేశ్ బాబు, ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పానని తెలిపారు. వారందరికీ ఈ దుఃఖాన్ని భరించేటటువంటి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు.


More Telugu News