ఫ్లాపులను ధైర్యంగా ఒప్పుకోవడం కృష్ణ నైజం!

  • కథ మొత్తం వినాల్సిన అవసరం లేదనేవారు  
  • వెంటనే తన నిర్ణయాన్ని చెప్పే అలవాటు 
  • నాన్చడం తెలియని స్వభావం 
  • తన సినిమా వసూళ్లు తెలుసుకోవడం ఓ హాబీ 
కృష్ణ మేనిఛాయ .. ఆయన కళ్లు ..  ఆయన కోటేరు ముక్కు .. ఖంగుమంటూ మోగే ఆయన స్వరం .. హైటుకు తగిన ఆకర్షణీయమైన రూపం .. ఇవన్నీ కూడా కృష్ణను హీరోగా నిలబెట్టాయి. ఎంత టైట్ క్లోజప్ లో చూపించినా అందంగా .. ఆకర్షణీయంగా కనిపించడం కృష్ణ ప్రత్యేకత. కృష్ణ ముక్కుసూటి మనిషి. ఏ విషయమైనా ఎదురుగా చెప్పడమే ఆయనకి తెలుసు. ఎదురుగా లేని వ్యక్తిని గురించి మాట్లాడటం .. విమర్శించడం ఆయనకి అలవాటు లేని పని.

ఇక సెట్లో కూడా కృష్ణ కబుర్లతో కాలక్షేపం చేయరని ఆయనతో పాటు కలిసి పనిచేసినవారు చెబుతుంటారు. తనపని తాను చేసుకుపోవడమే ఆయనకి తెలుసు. నిర్మాతల సమయాన్ని ఎంతమాత్రం వృథా చేయని హీరోగా ఆయన కనిపిస్తారు. తనతో రెగ్యులర్ సినిమాలు చేసే నిర్మాతలు వచ్చి కథ చెప్పినా, అది తనకి సెట్ కాకపోతే ఆ విషయాన్ని ఆయన వెంటనే చెప్పేసేవారు. ఏ కథనైనా ఒక పావుగంట వినేసి ఆ సినిమా చేస్తున్నదీ .. లేనిది చెప్పేసేవారట. అదే పద్ధతిని తన చివరివరకూ ఆయన కొనసాగించారు. 

ఇక అవుట్ పుట్ బాగా రాలేదని గ్రహించిన మేకర్స్, అదనపు హంగులు ఉండేలా చూద్దామని కృష్ణతో అంటే, 'ఇక మీరెన్ని చేసినా అది ఆడదు' అనేసి నిర్మొహమాటంగా చెప్పడం ఆయనకే చెల్లింది. అలాగే తన సినిమా ఏ సెంటర్ లో ఎంత కలెక్ట్ చేసిందనే విషయంలో ఆయన పూర్తి క్లారిటీతో ఉండేవారు. మిగతా హీరోలకు ఇది ఆశ్చర్యాన్ని కలిగించేది. ఒక్కోసారి అభిమానులు వచ్చి, ఫ్లాప్ సినిమాను కూడా హిట్ సినిమాగా చెబుతూ ఉంటే, ఆయన వెంటనే ఖండించేవారు. 'ఆ సినిమా పోయిందయ్యా ..' అంటూ నిజాయతీగా చెప్పేసేవారు. ఫస్టు కాపీ చూసిన తరువాత కృష్ణ ఏదైతే చెబుతారో .. అలాగే జరుగుతుందనే విషయాన్ని ఇండస్ట్రీలోని చాలామంది ఇప్పటికీ ఒప్పుకుంటూ ఉంటారు.


More Telugu News