కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ ఆదేశం

  • అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు కేసీఆర్ ఆదేశం
  • రేపు జరగనున్న కృష్ణ అంత్యక్రియలు
  • కృష్ణ పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు రేపు మహాప్రస్థానంలో జరగనున్నాయి. కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దివంగత సినీ నటుడు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని వెల్లడించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమర్ ను ఆదేశించారని తెలిపింది. 

మరోవైపు కృష్ణ మృతి పట్ల కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సొంత సినిమా సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశపెట్టిన ఘనత కృష్ణదేనని అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా జనాదరణ పొందారని కొనియాడారు. మరోవైపు నానక్ రామ్ గూడలోని నివాసం వద్దకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు. కృష్ణను కడసారి చూసుకుని, నివాళి అర్పిస్తున్నారు.


More Telugu News