దగ్గు ఎంతకీ తగ్గడం లేదంటే.. అనుమానించాల్సిందే!

  • బ్రాంకియల్ ఆస్తమా సమస్యతో దీర్ఘకాలంగా దగ్గు
  • లంగ్ కేన్సర్, సీవోపీడీ సమస్యల్లోనూ ఇదే ఇబ్బంది
  • రెండు వారాల్లోపు దగ్గు ఉపశమించాల్సిందే
  • లేదంటే వైద్యుల వద్దకు వెళ్లి నిర్ధారణ చేసుకోవాలి
విడవని దగ్గు, లేదా దీర్ఘకాలంగా ( కొన్ని రోజులుగా) దగ్గు (కాఫ్) వేధిస్తుంటే దీని వెనుక కారణం ఏంటన్నది తెలుసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేటి రోజుల్లో వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీనికి తోడు కరోనా వైరస్ బలహీనపడి అది ఇప్పటికీ మన సమాజంలో వ్యాప్తిలోనే ఉంది. పైగా ఇది శీతాకాలం. దీంతో దగ్గు వస్తుంటే నిర్లక్ష్యం చేయవద్దు. 

సాధారణంగా 8 వారాలుగా (రెండు నెలలు) దగ్గు విడవకుండా ఉంటే కనుక దాన్ని దీర్ఘకాలంగా (క్రానిక్ కాఫ్) పరిగణిస్తారు. దీనివల్ల నిద్ర సరిగ్గా ఉండదు. ఆహారం సరిగ్గా తీసుకోలేరు. తలనొప్పి, పక్కటెముకల ఫ్రాక్చర్లకు దారితీయవచ్చు. ‘‘క్రానిక్ కాఫ్ కు పలు కారణాలు ఉంటాయి. కచ్చితంగా ఏంటన్నది నిర్ధారించడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అంతర్లీనంగా కేన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు కూడా ఉండి ఉండొచ్చు’’ అని ప్రముఖ పల్మనరీ డాక్టర్ పుంజన్ పారిఖ్ తెలిపారు. 

బ్రాంకియల్ ఆస్తమా 
బ్రాంకియల్ ఆస్తమా అన్నది ఆస్తమాలో ఒక రకం. ఉబ్బస సమస్యలోనూ దగ్గు విడవకుండా వస్తుంటుంది. ఆస్తమా వల్ల ఎక్కువ మందిలో శ్వాస తీసుకోలేకపోవడం అనిపించదు. వైద్యుల వద్దకు వెళితే పరీక్షించి ఇన్ హేలర్ థెరపీ సూచిస్తారు. గతంతో పోలిస్తే నేడు ఆస్తమా అన్నది ఔషధాలతో చక్కగా నియంత్రించుకోతగినది. దుమ్ము, పొగ, కొన్ని రకాల వాసనలు, పుప్పొడి రేణువులు, శీతల వాతావరణం, వాయు కాలుష్యం ఆస్తమా సమస్యను పెంచుతాయి.

కరోనా, వైరల్ ఇన్ఫెక్షన్లు
కరోనాలోనూ దగ్గు వస్తుంటుంది. కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొద్ది మంది దగ్గు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే రెండు వారాల వ్యవధిలో దాదాపు తగ్గిపోతుంది. కనుక రెండు వారాల తర్వాత కూడా ఉందంటే అది కరోనా వల్ల కాకపోవచ్చు.

ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ)
విడవకుండా దగ్గు చాలా రోజులుగా ఉంటే అది టీబీ వల్లేనా? అన్నది అనుమానించాల్సిందే. రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.

కేన్సర్
లంగ్ కేన్సర్, లంగ్ ఫైబ్రోసిస్, తీవ్ర శ్వాసకోశ సమస్య (సీవోపీడీ), హార్ట్ ఫెయిల్యూర్, ఏసీఈ ఇన్ హిబిటర్స్ (బీపికి సూచించే) మందుల వాడకంలోనూ దగ్గు దీర్ఘకాలంగా వేధిస్తుంది. అందుకని రెండు వారాలకు కూడా దగ్గు తీవ్రత తగ్గకపోతే తప్పకుండా వైద్యుల వద్దకు వెళ్లాలి. 



More Telugu News