మూడేళ్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది!

  • రూ.719 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి
  • 4 అంతస్తుల్లో కారు పార్కింగ్ కు ఏర్పాట్లు
  • 32 ఎస్కలేటర్లతో పాటు 2 ట్రావెలేటర్లు కూడా నిర్మాణం
  • అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఆధునికీకరిస్తోంది. ప్రస్తుతం స్టేషన్ లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుతో పాటు ఆధునికీకరణ పూర్తయిన తర్వాత రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందన్న చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

కిషన్ రెడ్డి చెప్పిన ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు రానున్న మూడేళ్లలో పూర్తి కానున్నాయి. రూ.719 కోట్లతో జరుగుతున్న ఈ పనులు పూర్తయితే... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అన్ని ఆధునిక సదుపాయాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. వీటిలో 4 అంతస్తుల్లో కారు పార్కింగ్, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ఏర్పాట్లతో రానున్న 30 ఏళ్లకు సరిపడ వసతులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి వచ్చినట్లేనని కిషన్ రెడ్డి చెప్పారు.


More Telugu News