దమ్ము లేదు గానీ ఆశ మాత్రం ఉంది... టీడీపీ, జనసేనలపై వైసీపీ నేత కరణం వెంకటేశ్ విమర్శలు

  • 175 స్థానాల్లో విడివిడిగా పోటీ చేసే దమ్ము టీడీపీ, జనసేనకు లేదన్న కరణం వెంకటేశ్
  • ఆశ మాత్రమే ఉంటే అధికారంలోకి రాలేమన్న వైసీపీ యువ నేత
  • చంద్రబాబు వల్ల లభించిన ప్రయోజనంపై కుప్పం ప్రజలకే సమాధానం దొరకడం లేదని ఎద్దేవా
ఏపీలో విపక్ష పార్టీలు టీడీపీ, జనసేనలపై అధికార పార్టీ వైసీపీకి చెందిన యువ నేత కరణం వెంకటేశ్ సోమవారం విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన విపక్షాలపై ఘాటు విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విడివిడిగా పోటీ చేయడానికి దమ్ము లేని టీడీపీ, జనసేనలు... అధికారంలోకి రావాలని ఆశ పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆశ మాత్రమే ఉంటే... అధికారంలోకి రాలేరని కూడా ఆయన చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల దీవెనలు ఉంటేనే అధికారంలోకి వస్తారన్నారు. ఆ లక్షణం ఒక్క వైసీపీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు.

టీడీపీ, జనసేనల మధ్య పొత్తు గురించి కూడా కరణం వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు... మూడేళ్లు తిరక్కుండానే 2017లో ఒకరిపై మరొకరు ఎలా విమర్శలు చేసుకున్నారో ప్రజలు ఇంకా మరిచిపోలేదని అన్నారు. అదే సమయంలో 2019 ఎన్నికల్లో ఏ రీతిన విడిపోయి పోటీ చేశారో కూడా ప్రజలు చూశారన్నారు. వాళ్లల్లో వాళ్లే తిట్టుకుని మళ్లీ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అన్యాయమే జరిగిందన్నారు. సుదీర్ఘంగా అధికారంలో కొనసాగిన చంద్రబాబు వల్ల ఏమైనా ప్రయోజనం దక్కిందా? అంటే.. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ప్రజలకే సమాధానం దొరకడం లేదని వెంకటేశ్ అన్నారు.


More Telugu News