టీమిండియా హెడ్ కోచ్ గా ద్రావిడ్ ఉండగా బ్యాటింగ్ కోచ్ అవసరమా?: గవాస్కర్

  • టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లో ఓడిన భారత్
  • సపోర్టింగ్ స్టాఫ్ ఎక్కువయ్యారన్న గవాస్కర్
  • ఆటగాళ్ల కంటే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని విమర్శలు
  • ఆటగాళ్లు అయోమయానికి గురవుతారని వ్యాఖ్య
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం సెమీస్ వద్దే ఆగిపోయిన నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వినిపించారు. జట్టులో ఆటగాళ్ల కంటే సహాయక సిబ్బంది సంఖ్యే ఎక్కువగా ఉందని అన్నారు. 

ప్రపంచ మేటి బ్యాట్స్ మన్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా ఉండగా, ప్రత్యేకంగా ఓ బ్యాటింగ్ కోచ్ అవసరమా? అని ప్రశ్నించారు. జట్టులోని ఆటగాళ్లకు ద్రావిడ్ సూచనలు పాటించాలో, లేక బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సలహాలు వినాలో అర్థంకాని గందరగోళ పరిస్థితి నెలకొంటుందని గవాస్కర్ విశ్లేషించారు. ద్రావిడ్ ఒకటి చెబుతాడు, రాథోడ్ మరొకటి చెబుతాడు... ఆటగాళ్లు ఎవరి మాట వినాలి? అని ప్రశ్నించారు. 

1983లో భారత్ వరల్డ్ కప్ నెగ్గినప్పుడు జట్టు వెంట ఒక్క మాన్ సింగ్ మాత్రమే మేనేజర్ గా ఉన్నారని వెల్లడించారు. ఆ తర్వాత 1985లో ప్రసన్న ఒక్కడే మేనేజర్ గా వ్యవహరించారని తెలిపారు. 2011లోనూ టీమిండియాతో పరిమిత సంఖ్యలో కోచింగ్ స్టాఫ్ ఉండేవారని చెప్పారు. జట్టులో సహాయక సిబ్బంది ఎక్కువమంది ఉన్నప్పుడు ఎవరి మాట వినాలో తెలియక ఆటగాళ్లు అయోమయానికి గురవుతారని గవాస్కర్ వివరించారు.


More Telugu News