దివంగత ములాయం స్థానాన్ని భర్తీ చేయనున్న ఆయన కోడలు డింపుల్

  • మెయిన్ పురి లోక్ సభ స్థానానికి  నేడు నామినేషన్ దాఖలు చేయనున్న డింపుల్ యాదవ్
  • ములాయం సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన అఖిలేశ్, డింపుల్
  • వచ్చేనెల 5న ఉప ఎన్నిక
సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయకురాలు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఉప ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. తన మావయ్య, దివంగత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్ పురి లోక్ సభ స్థానానికి ఈ రోజు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ సమాధి వద్ద డింపుల్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ పుష్పాంజలి ఘటించారు. సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా భావించే మెయిన్‌పురి స్థానానికి డిసెంబర్ 5 న పోలింగ్ జరగనుండగా, అదే నెల 8న ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, డింపుల్ నామినేషన్లు దాఖలు చేయడానికి ముందు, వివిధ పార్టీ కార్యకర్తలు, నాయకులు అఖిలేశ్ యాదవ్ నివాసాన్ని సందర్శించారు. 

డింపుల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్, ధర్మేంద్ర యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ సహా ఇతర నేతలు హాజరవుతారని మెయిన్‌పురి ఎస్పీ జిల్లా అధ్యక్షుడు అలోక్ శక్య తెలిపారు. యాదవ్ కుటుంబం ముందుగా మెయిన్‌పురి పార్టీ కార్యాలయానికి చేరుకుంటుందని, ఆ తర్వాత నామినేషన్ కోసం కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటారని చెప్పారు. కాగా, ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 17 కాగా,  21 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.


More Telugu News