ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ దూకుడు.. బోయినపల్లి అభిషేక్ రావు అరెస్ట్

  • ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సన్నిహితుడు విజయ్ నాయర్ ను కూడా అరెస్ట్ చేసిన ఈడీ
  • ఇప్పటికే సీబీఐ అదుపులో ఉన్న అభిషేక్, విజయ్
  • వీరి బెయిల్ పిటిషన్ పై నేడు వెలవడనున్న తీర్పు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) సంబంధించిన వ్యాపారవేత్త, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్,  హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్ రావుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అరెస్టు చేసింది. ఇదే కేసు విషయంలో ఈ ఇద్దరినీ సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. వీరి బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఈడీ అభిషేక్ రావు, విజయ్ నాయర్ ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి ఆప్ కమ్యూనికేషన్ ఇంచార్జ్ విజయ్ నాయర్, అభిషేక్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై రూస్ అవెన్యూ కోర్టు ఈ నెల 9న తన తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్‌ వాదనలు ముగియడంతో ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ తీర్పును రిజర్వ్‌లో ఉంచగా, బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు ఉత్తర్వులు వెలువడనున్నాయి.
 
ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్‌లో ప్రధాన నిందితుల్లో నాయర్ ను ఒకరిగా భావిస్తున్నారు. లండన్ లో ఉన్న నాయర్ ను విచారణ కోసం సీబీఐ భారత్ కు పిలిపించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 27న అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో నాయర్ అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. ఢిల్లీ అధికార ఆప్‌ పార్టీకి సన్నిహితుడిగా భావిస్తున్న నాయర్.. పార్టీ నాయకుల కార్యక్రమాలను, వారి సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించడంలో సాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


More Telugu News