పాక్ మహిళకు యూపీలో ఓటుహక్కు.. విచారణకు ఆదేశాలు

  • దీర్ఘకాలిక వీసాపై భారత్ లో ఉంటున్న పాక్ మహిళ సబా పర్వీన్
  • మొరాదాబాద్ ఓటరు జాబితాలో పర్వీన్ పేరు
  • కలకలం రేగడంతో పేరును తొలగించిన అధికారులు
  • ఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
దీర్ఘకాలిక వీసాపై మన దేశంలో ఉంటున్న పాకిస్థానీ మహిళకు ఉత్తరప్రదేశ్ ఎన్నికల అధికారులు ఏకంగా ఓటు హక్కు కల్పించారు. ఇటీవల ఈ విషయం బయట పడడంతో స్థానికంగా కలకలం రేగింది. కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు. పాకిస్థాన్ కు చెందిన సబా పర్వీన్ ఉత్తరప్రదేశ్ యువకుడిని పెళ్లాడింది. 2005 లో పెళ్లి కావడంతో భర్త సొంతూరు మొరాదాబాద్ లోని పక్బారా నగర్ పంచాయతీకి వచ్చింది. దీర్ఘకాలిక వీసాపై భారత్ లో అడుగుపెట్టిన సబా పర్వీన్.. 2005 నుంచి పక్బారా నగర్ లోనే నివసిస్తోంది.

2017లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా సబా పర్వీన్ పేరు ఓటర్ జాబితాలోకి చేరింది. ఇటీవల నిర్వహించిన ఓటరు జాబితా విచారణలో ఈ విషయం బయటపడింది. దీంతో జిల్లా కలెక్టర్ స్పందించి సబా పర్వీన్ పేరును జాబితా నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ విషయంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాలాకాలంగా పర్వీన్ అక్కడే ఉంటుండడంతో స్థానిక అధికారులు ఓటర్ గా నమోదు చేసి ఉండొచ్చని కలెక్టర్ శైలేంద్ర సింగ్ వివరించారు. అయితే, భారత పౌరసత్వం లేని వ్యక్తి పేరును ఓటరు జాబితాలో చేర్చకూడదని కలెక్టర్ తెలిపారు.


More Telugu News