తిరుమలలో రద్దీ.. దర్శనానికి 40 గంటలు

  • కంపార్ట్ మెంట్లలో భక్తుల వెయిటింగ్
  • తిరుపతి చెక్ పాయింట్ వద్ద బారులు తీరిన వాహనాలు
  • శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు
  • ఫొటోగ్రాఫర్లపై విజిలెన్స్ అధికారుల చర్యలు
వారాంతం, సెలవులు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి దాదాపు 40 గంటలు పడుతోందని అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని వివరించారు. ఆలయం ముందు భక్తులను ఇబ్బంది పెడుతున్న ఫొటోగ్రాఫర్లను కట్టడి చేయడానికి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది చర్యలు చేపట్టారు. అనుమతిలేకుండా గుడి ముందు ఫొటోలు తీస్తున్న వారి నుంచి కెమెరాలు లాక్కుని హుండీలో వేశారు. మరోసారి దొరికితే చర్యలు తప్పవని ఫొటోగ్రాఫర్లను అధికారులు హెచ్చరించారు.

హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు..
శని, ఆదివారాల్లో తిరుమల కొండలు భక్తజన సంద్రంగా మారాయి. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో క్యూ కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. శనివారం మొత్తం 57,104 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 32 వేల మంది తలనీలాలు ఇచ్చారని టీటీడీ అధికారులు చెప్పారు. హుండీల ఆదాయం రూ.4.66 కోట్లు వచ్చిందని వెల్లడించారు. శనివారం వర్షం కురవడంతో చలి తీవ్రత పెరిగి భక్తులు ఇబ్బంది పడ్డారు. తిరుపతి చెక్ పాయింట్ వద్ద భక్తుల వాహనాలు బారులు తీరాయి. భద్రతా సిబ్బంది వాహనాలను క్షుణ్ణంగా చెక్ చేస్తుండడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగాయి.

కాణిపాకంలోనూ భక్తుల రద్దీ..
స్వయంభు గణపతి స్వర్ణ రథంపై ఊరేగుతూ కాణిపాకంలో భక్తులకు దర్శనమిచ్చారు. సంకటహర చతుర్థి సందర్భంగా దేవేరులతో కలిసి స్వర్ణ రథంపై ఊరేగారు. వారాంతం సెలవులతో కాణిపాకంలోనూ భక్తుల రద్దీ పెరిగింది. వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులకు సుమారు 4 గంటలు పట్టింది.


More Telugu News