నేడే టీ20 వరల్డ్ కప్ ఫైనల్... విజేతగా నిలిచేదెవరో?

  • ఎంసీజీ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్
  • న్యూజిలాండ్ ను చిత్తు చేసి ఫైనల్ చేరిన పాక్
  • భారత్ పై భారీ విజయంతో టైటిల్ పోరుకు చేరిన ఇంగ్లండ్
  • ఫైనల్ లొో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్న ఇరు జట్లు
దాదాపుగా నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన టీ20 వరల్డ్ కప్ నేటితో ముగియనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఆది నుంచి సంచలనాలే నమోదవుతూ వస్తున్నాయి. పసికూనలు అనుకున్న జట్టు... అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న జట్లను చిత్తు చేసి ఔరా అనిపించాయి. అదే సమయంలో హాట్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన అగ్ర శ్రేణి జట్లు సెమీస్ దాకా కూడా చేరలేక మధ్యలోనే టోర్నీ నుంచి వెనుదిరిగాయి. లీగ్ దశలో మెరుగైన ప్రతిభ కనబరచిన జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించలేకపోగా... లీగ్ దశలో చెత్తగా ఆడిన జట్లు తమ అదృష్టం కొద్దీ ఏకంగా ఫైనల్ చేరాయి. 

నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రతిష్ఠాత్మక మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా జరగనున్న టైటిల్ పోరులో ఇంగ్లండ్ జట్టుతో పాకిస్థాన్ తలపడనుంది. లీగ్ దశలో ఉత్తమ ప్రతిభ కనబరచి సెమీస్ లో పటిష్టమైన భారత జట్టును ఓడించి ఇంగ్లండ్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అదే సమయంలో లీగ్ దశలో పేలవ ప్రదర్శనతో... ఇతర జట్ల ఓటమి పుణ్యమా అని సెమీస్ అర్హత సాధించిన పాక్ జట్టు... సెమీస్ లో జూలు విదిల్చి పటిష్టంగా కనిపించి... లీగ్ దశలో అందరికంటే మిన్నగా ప్రతిభను చాటిన న్యూజిలాండ్ జట్టును ఓడించి టైటిల్ పోరుకు సిద్ధమైంది.

టైటిల్ పోరుకు సర్వం సిద్ధమైన వేళ... ఇరు జట్లు కూడా సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సెమీ ఫైనల్ లో ఇరు జట్లు తమ ప్రత్యర్థులను ఏకపక్షంగా ఓడించి మరీ ఫైనల్ చేరాయి. ఇరు జట్ల బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లైనప్ కూడా పటిష్టంగానే ఉన్నాయని చెప్పాలి. ఈ క్రమంలో ఇరు జట్లు సెమీస్ లో ఆడిన కూర్పుతోనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫామ్ లేమితో కనిపించిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్... సెమీస్ లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అదే సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ కూడా తానెంత ప్రమాదకారో భారత్ తో జరిగిన సెమీస్ లో నిరూపించాడు. అన్ని విభాగాల్లో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న పాక్, ఇంగ్లండ్ లు ఇప్పటికే ఓ దఫా టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకోగా... నేటి ఫైనల్ లో ఎవరు గెలిచినా రికార్డేనని చెప్పక తప్పదు.


More Telugu News