రేపు టీ20 వరల్డ్ కప్ ఫైనల్... చరిత్రను పాక్ రిపీట్ చేస్తుందా? ఇంగ్లండ్ ఫామ్ ను చాటుకుంటుందా?

  • ముగింపు దశకు చేరుకున్న టీ20 వరల్డ్ కప్
  • రేపు మెల్బోర్న్ లో ఫైనల్ మ్యాచ్
  • ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్
  • 1992లో ఇంగ్లండ్ ను ఓడించి కప్ నెగ్గిన పాక్
  • ఈసారి అత్యంత బలంగా ఉన్న ఇంగ్లండ్
గత నెలరోజులుగా క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరించిన టీ20 వరల్డ్ కప్ ముగింపు దశకు చేరింది. రేపు (నవంబరు 13) మెల్బోర్న్ లో ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుందని భావించిన పాకిస్థాన్ అనూహ్యరీతిలో పుంజుకుని సెమీస్ అడ్డంకిని దాటి ఫైనల్ చేరుకోగా, సెమీస్ లో టీమిండియాపై తిరుగులేని విజయంతో ఇంగ్లండ్ టైటిల్ సమరానికి సిద్ధమైంది. 

ఈ రెండు జట్ల విజయావకాశాలను పరిశీలిస్తే ఫామ్ పరంగా క్రికెట్ విశ్లేషకులు ఇంగ్లండ్ కే ఓటేస్తున్నారు. అయితే చరిత్రను పరిశీలిస్తే 1992లో ఇంగ్లండ్, పాకిస్థాన్ వరల్డ్ కప్ ఫైనల్లో తలపడగా, ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాక్ జట్టే విజేతగా నిలిచింది. ఇప్పుడా చరిత్ర రిపీట్ అవ్వాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. 

ఈ వరల్డ్ కప్ గ్రూప్ దశలో పాక్ ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. తొలుత చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిన పాక్... రెండో మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో దిగ్భ్రాంతికర పరాజయం చవిచూసింది. చివరికి నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించడంతో అదృష్టం కలిసొచ్చి పాక్ సెమీస్ చేరింది. 

మరోవైపు ఇంగ్లండ్ జట్టు గ్రూప్ దశలో ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని సెమీస్ చేరి, ఆపై సాధికారిక విజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది. పాక్ జట్టులో ఆశలన్నీ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ పైనే ఉండగా, ఇంగ్లండ్ జట్టులో ఒకటి నుంచి ఎనిమిదో స్థానం వరకు భారీ హిట్టర్లుండడం అదనపు బలంగా కనిపిస్తోంది. 

ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. వీరికి తోడు బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్ తో ఇంగ్లండ్ లైనప్ పటిష్ఠంగా ఉంది. బౌలింగ్ లో ఎంతో ఉపయుక్తంగా ఉండే క్రిస్ జోర్డాన్ కూడా భారీ షాట్లు కొట్టగల సమర్థుడే. 

షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ వాసిమ్ జూనియర్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ లతో కూడిన పాక్ బౌలింగ్ దళం ఇంగ్లండ్ లైనప్ ను ఏమేరకు నియంత్రిస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం. అయితే తనదైన రోజున పాకిస్థాన్ ఎంతటి బలమైన జట్టునైనా మట్టికరిపిస్తుందన్న విషయం గమనార్హం.


More Telugu News