పని చేయకపోతే.. సిరిసిల్ల ప్రజలు నన్ను ఎప్పుడో పక్కన పెట్టేవారు: కేటీఆర్

  • అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో జరిగిన చర్చకు హాజరైన కేటీఆర్
  • వారసత్వం రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని వ్యాఖ్య
  • సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని ప్రజలు భరించరన్న మంత్రి
  • ఇందిరా గాంధీ వంటి నేతలనే ప్రజలు ఓడించారని వెల్లడి
వారసత్వ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వం రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మాత్రమే పనికి వస్తుందన్న కేటీఆర్... ప్రతిభను నిరూపించుకోకపోతే ఏ ఒక్కరూ రాజకీయాల్లో రాణించలేరన్నారు. ప్రతిభ లేకున్నా... కేవలం వారసత్వంతో రాజకీయాల్లో రాణించవచ్చని చాలా మంది అనుకుంటున్నారన్న కేటీఆర్... ఆ భావన తప్పు అని చెప్పారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీడియా ఇన్ తెలంగాణ ఫాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై శనివారం జరిగిన చర్చలో కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 

ఈ సందర్భంగా రాజకీయ వారసత్వాన్ని ప్రస్తావించిన కేటీఆర్... వారసత్వం కేవలం రాజకీయాల్లోకి ప్రవేశాన్ని మాత్రమే ఇస్తుందన్నారు. ఆ తర్వాత సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వ నాయకుడిని కూడా ప్రజలు భరించరని ఆయన చెప్పారు. ఇందిరా గాంధీ వంటి నేతలనే ప్రజలు ఓడించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్వయంగా తన అంశాన్నే ఇందుకు ఉదాహరణగా ఆయన చెప్పుకొచ్చారు. తన పనితీరుతోనే సిరిసిల్లలో తనకు క్రమంగా మెజారిటీ పెరుగుతూ వస్తోందని ఆయన అన్నారు. తాను సరిగ్గా పనిచేయకపోయి ఉంటే... సిరిసిల్ల ప్రజలు తనను ఎప్పుడో పక్కనపెట్టేవారని కూడా ఆయన అన్నారు.


More Telugu News