బొంగు చికెన్ వండిన రాహుల్ గాంధీ... వీడియోను విడుదల చేసిన టీపీసీసీ

  • భారత్ జోడో యాత్రలో సాగుతున్న రాహుల్ గాంధీ
  • తెలంగాణలో యాత్ర ముగుస్తున్న సందర్భంగా గిరిజనులతో భేటీ
  • గిరిజనులతో కలిసి బొంగు చికెన్ వండి వార్చిన రాహుల్
  • స్వయంగా అందరికీ వడ్డించి తాను కూడా రుచి చూసిన కాంగ్రెస్ నేత
తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో తయారయ్యే బొంగు చికెన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెదురు బొంగులో చికెన్ వండే విధానం, దాని రుచి గురించి తెలుగు జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాంటి బొంగు చికెన్ ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలతో కలిసి వండారు. అనంతరం పార్టీకి చెందిన తెలంగాణ నేతలు, గిరిజనులతో కలిసి బొంగు చికెన్ రుచి చూశారు. తాను వండిన బొంగు చికెన్ ను తానే అందరికీ వడ్డించి మరీ ఆయన తన ముచ్చట తీర్చుకున్నారు. ఈ అరుదైన ఘటనకు చెందిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. 

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇటీవలే తెలంగాణను దాటుకుని మహారాష్ట్రలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో యాత్ర సాగుతున్న సమయంలో ఆయా ప్రాంతాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు రాహుల్ ఆసక్తి చూపారు. ఈ క్రమంలో యాత్ర ముగుస్తున్న సమయంలో ఓ రోజు మధ్యాహ్నం టీపీసీసీ నేతలతో పాటు గిరిజనులతోనూ రాహుల్ గాంధీ పొలాల మధ్యన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తన యాత్ర సాగిన తీరు, నేతల నుంచి అందిన సహకారం తదితరాలపై రాహుల్ చర్చించారు. 

ఈ సమయంలోనే పొలాల మధ్య ముచ్చట్లకు ముందు గిరిజనులతో కలిసి రాహుల్ గాంధీ బొంగు చికెన్ వండారు. మసాలా దట్టించిన చికెన్ ను తన చేతిలోకి తీసుకున్న రాహుల్ గాంధీ...దానిని అప్పటికే సిద్ధం చేసిన బొంగుల్లో కూరారు. ఆ తర్వాత వాటిని మంటపై పెట్టి కాల్చారు. అలా మంటపై చికెన్ దట్టించిన బొంగులను పేర్చిన తర్వాత నేతలతో కలిసి పిచ్చాపాటిగా మాట్లాడిన రాహుల్ గాంధీ... బొంగు చికెన్ తయారైందన్న సమాచారం రాగానే... సమీక్షను ముగించారు. 

అనంతరం నేతలతో కలిసి బొంగుల్లో నుంచి చికెన్ ను బయటకు తీసిన రాహుల్...చికెన్ ను ప్లేట్లలో పెట్టి పార్టీ నేతలతో పాటు గిరిజనులకు స్వయంగా అందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. బొంగు చికెన్ ను రుచి చూసి అద్భుతమని కూడా చెప్పారు. మొత్తంగా టీపీసీసీ విడుదల చేసిన ఈ వీడియో జనాన్ని ఆకట్టుకుంటోంది.


More Telugu News