న్యుమోనియాను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాంతకం

  • పిల్లలు, వృద్ధులకు ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ
  • తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి
  • ముందస్తు నివారణ టీకాలు ఇప్పించడం కూడా అవసరమే
న్యుమోనియా అన్నది తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల న్యుమోనియా బారిన పడొచ్చు. ఈ ఇన్ఫెక్షన్ అందరికీ ప్రాణాంతకం అవుతుందని అనుకోవద్దు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణ ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు న్యుమోనియాతో ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి ఇది వ్యాపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదేళ్లలోపు చిన్నారులు 8 లక్షల మందికి పైనే న్యుమోనియా కారణంగా చనిపోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. మన ఊపిరితిత్తుల్లో గాలి సంచులు ఉంటాయి. అవి శ్వాస తీసుకున్నప్పుడు ఉబ్బుతుంటాయి. న్యుమోనియా వచ్చినప్పుడు ఈ గాలి సంచులు శ్లేష్మంతో నిండుతాయి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. తగినంత ఆక్సిజన్ లభించదు. ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ పై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా నవంబర్ 12వ తేదీని ప్రపంచ న్యుమోనియా దినంగా నిర్వహిస్తోంది.

లక్షణాలు
న్యుమోనియా సాధారణ జలుబు, దగ్గు మాదిరే అనిపిస్తుంది. దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, జ్వరం, చెమటలు పట్టడం, అలసట, ఛాతీలో నొప్పి, తల తిరగడం, వాంతులు, అతిసారం న్యుమోనియా లక్షణాలు. వీటిని ఎక్కువ మంది సాధారణ జలుబు కింద భావిస్తుంటారు. కానీ, పిల్లలు, వృద్ధుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుల వద్దకు తప్పకుండా వెళ్లాలి.

చికిత్స/నివారణలు
  • ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల  సోకిందా? అన్నది వైద్యులు నిర్ధారించుకుని ఔషధాలు సూచిస్తారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తగినంత విశ్రాంతి కూడా అవసరం. 
  • తప్పకుండా టీకా తీసుకోవాలి. న్యూమోకొక్కల్ వ్యాక్సిన్ ఉంటుంది. అలాగే, మీజిల్స్, ఇన్ ఫ్లూయెంజా, పెర్టూసిస్ నివారణ టీకాలు కూడా పిల్లలకు ఇప్పించాలి. పెద్దలు సైతం ఇన్ ఫ్లూయెంజా, న్యుమోనియా టీకాలు తీసుకోవడం వల్ల రక్షణ లభిస్తుంది.
  • ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా న్యుమోనియా బారిన పడకుండా చూసుకోవచ్చు. 
  • రోజువారీ తగినంత వ్యాయామం, పోషకాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బలోపేతం అవుతుంది.


More Telugu News