ఈ అలవాట్లతో కిడ్నీలకు డేంజర్!

  • ఎక్కువసేపు పడుకోవడమూ మంచిది కాదట
  • ఉప్పును దూరంపెట్టాలని నిపుణుల సూచన
  • మద్యపానం అసలే వద్దని హెచ్చరిక
  • నీళ్లు ఎక్కువగా తాగాలని హితవు
ఆరోగ్యకరమైన అలవాట్లను నిత్యజీవితంలో ఆచరించడం ఎంత ముఖ్యమో అనారోగ్యకరమైన అలవాట్లను వదిలించుకోవడమూ అంతే ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతుంటారు. తెలిసీ తెలియక మనం రోజూ చేసే పనులలో కొన్ని కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపిస్తాయని అన్నారు. అలాంటి అలవాట్లు ఏంటో తెలుసుకుని వాటిని వదిలించుకోండి..

శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను వడకట్టి బయటికి పంపే బాధ్యత మన శరీరంలోని కిడ్నీలదే. ఈ వ్యర్థాలను బయటకు పంపించే పనిని అవి బాగా చేసినంత వరకు మనం ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు వివరించారు. అలాంటి కిడ్నీలను మనం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు. కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపే అలవాట్లు.. అతినిద్ర, ఉప్పు అతిగా తీసుకోవడం, మద్యపానం, నీళ్లు తక్కువగా తాగడం, చురుకుదనం లేకపోవడం.

ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరమని అందరికీ తెలిసిందే.. అయితే, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి అతినిద్ర కూడా చేటేనని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువసేపు నిద్రించడం వల్ల కిడ్నీలలో మూత్రం ఎక్కువగా చేరుతుందని, ఫలితంగా కిడ్నీలు దెబ్బతింటాయని వివరించారు.

ఆహార పదార్థాల్లో ఉప్పును మితంగా వాడడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పును ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలకు నష్టమేనని హెచ్చరిస్తున్నారు. మూత్రపిండాలపై సోడియం వ్యతిరేక ప్రభావం చూపుతుందని అన్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిపై సోడియం ప్రభావం ఇంకా ఎక్కువగా పడుతుందన్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ, గుండెపోటు వంటి సమస్యలు వచ్చే రిస్క్ కూడా పెరుగుతుందనే విషయం తెలిసిందే!

మద్యపానంతో కిడ్నీ ముప్పులను కొనితెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మద్యపానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలవాటు వల్లో, బాత్రూమ్ కు ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుందనో, సదుపాయాలు లేవనో.. కారణమేదైతేనేం కొంతమంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీనికి కారణాలమాటెలా ఉన్నా కిడ్నీలు మాత్రం దెబ్బతింటాయని వైద్యులు చెబుతుంటారు. శరీరంలోని మలినాలు కిడ్నీలో పేరుకుపోకుండా ఉండాలంటే నీళ్లు పుష్కలంగా తాగాలని చెప్పారు.

అనారోగ్యం పేరుతో బెడ్ దిగకుండా కూర్చోవడం కూడా కిడ్నీల అనారోగ్యానికి దారితీస్తుందట. తేలికపాటి వ్యాయామాలతో శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం ఎక్కువగా ఉండే బంగాళదుంపలు, బత్తాయి పండ్లు, అరటి పండ్లు, అవకాడోలను దూరంపెట్టాలని కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్లకు నిపుణులు సూచిస్తున్నారు.


More Telugu News