ధోనీ రికార్డును మరే భారత కెప్టెన్ కూడా సమం చేయలేడు: గంభీర్

  • టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన టీమిండియా
  • మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం ఎవరికీ సాధ్యంకాదన్న గంభీర్ 
  • ధోనీ రికార్డును ఎవరూ సమం చేయలేరని వ్యాఖ్యలు
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ లోనే వెనుదిరగడం పట్ల మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత కెప్టెన్ గా ఎమ్మెస్ ధోనీ రికార్డును మరే భారత కెప్టెన్ కూడా సమం చేయలేడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. 

"ఎవరో ఒకరు జట్టులోకి వచ్చి రోహిత్ శర్మ కంటే అత్యధిక డబుల్ సెంచరీలు కొట్టొచ్చు... లేకపోతే కోహ్లీ కంటే అత్యధిక సెంచరీలు నమోదు చేయవచ్చు... కానీ, ఏ భారత కెప్టెన్ కూడా ధోనీలాగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుస్తాడని మాత్రం అనుకోను" అంటూ గంభీర్ పేర్కొన్నాడు. 

ధోనీ నాయకత్వంలో టీమిండియా 2007లో టీ20 వరల్డ్ కప్ గెలవగా, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గింది. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ధోనీ కాకుండా భారత్ కు ఐసీసీ ట్రోఫీ అందించింది కపిల్ దేవ్ ఒక్కడే. కపిల్ నాయకత్వంలోని భారత జట్టు 1983లో వరల్డ్ కప్ ను అందుకోవడం తెలిసిందే.


More Telugu News