ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు

  • సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
  • నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ
  • కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న నిందితుల న్యాయవాది
  • రోహిత్ రెడ్డికి ఫిర్యాదు చేసే అర్హత లేదని వాదన 
  • సోమవారం నాడు తీర్పు వెలువరించనున్న కోర్టు
తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పై తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. 

విచారణ సందర్భంగా... ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అర్హత లేదని కోర్టుకు తెలిపారు. వెంటనే ముగ్గురికీ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు రూ.100 కోట్లు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలపై రామచంద్రభారతి, సింహయాజి, నందు అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం తెలిసిందే. వీరు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. 

ఈ ముగ్గురు నిందితుల నుంచి నేడు వాయిస్ శాంపిల్స్ సేకరించినట్టు తెలుస్తోంది. బేరసారాల వీడియోలో వాయిస్ ను, తాజాగా సేకరించిన వాయిస్ తో పోల్చిచూడనున్నారు. అటు, కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు తొలుత ఈ ముగ్గురిని వేర్వేరుగా విచారించారు. అనంతరం, ముగ్గురిని కలిపి విచారించారు. వేర్వేరుగా ప్రశ్నించిన సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.


More Telugu News