మూవీ రివ్యూ: 'యశోద'

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'యశోద'
  • టైటిల్ రోల్ ను పోషించిన సమంత 
  • ఆమె నటనకు కొలమానంగా నిలిచే పాత్ర
  • ఆమె కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా  
  • ఎమోషన్ కీ - యాక్షన్ కి దక్కిన పెద్దపీట
  • ప్రధానమైన బలంగా నిలిచిన ఫొటోగ్రఫీ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఒక వైపున హీరోల సరసన నాయికగా అలరిస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన పాత్రలలోను సమంత మెప్పిస్తూ వెళుతోంది. అలా 'యూ టర్న్' .. 'ఓ బేబీ' .. 'జాను' వంటి సినిమాల తరువాత ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమానే 'యశోద'. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, హరి - హరీశ్ దర్శకత్వం వహించారు. ఇటీవల వదిలిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వెళ్లింది. ఈ రోజునే ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లకు వచ్చింది.

లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సహజంగానే యాక్షన్ .. ఎమోషన్ ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అయితే ఆ యాక్షన్ .. ఎమోషన్ రెండూ కూడా ఏ పాయింట్ చుట్టూ తిరుగుతాయనే విషయంపైనే అది ఆడియన్స్ కి కనెక్ట్ కావడం జరుగుతుంది. కొత్త పాయింట్ ను చెప్పడానికి ట్రై చేసినప్పుడే అవి ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతాయి. ఉత్కంఠతో ప్రేక్షకుల చూపులు కథ వెంట పరుగులు తీస్తాయి. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోనే 'యశోద' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతా అనుకున్నట్టుగా ఇది 'సరోగసి' చుట్టూ తిరిగే కథ కాదు. సరోగసి పేరుతో జరిగే బిజినెస్ చుట్టూ అల్లుకున్న కథ. 

కథలోకి వెళితే యశోద (సమంత) ఒక మురికివాడలో తన చెల్లెలితో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. చెల్లెలికి ఆపరేషన్ చేయించడం కోసం ఆమెకి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఆ డబ్బు కోసమే ఆమె 'సరోగసి'కి ఒప్పుకుంటుంది. ఆ కారణంగానే ఆమె ఒక సాలెగూడులో చిక్కుకుంటుంది. ఆమె కడుపులో ఒక శ్రీమంతుల బిడ్డ పెరుగుతున్నదని చెప్పి ఒక విలాసవంతమైన సెంటర్ లో ఉంచుతారు. అక్కడ తనకి అన్నిరకాల వసతి సౌకర్యాలు కల్పించడం యశోదకి సంతోషాన్ని కలిగిస్తుంది. 

తన మాదిరిగానే అక్కడ శ్రీమంతుల బిడ్డలను మోస్తున్నవారితో యశోదకి పరిచయమవుతుంది. అక్కడి వారి పర్యవేక్షణను మధుబాల (వరలక్ష్మి శరత్ కుమార్) చూసుకుంటూ ఉంటుంది. డాక్టర్ గౌతమ్ (ఉన్ని ముకుందన్)తో యశోదకి చనువు ఏర్పడుతుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ యశోదకి అక్కడివారి పనితీరుపై అనుమానం వస్తుంది. సరోగసి పేరుతో తమ చుట్టూ ఏదో జరుగుతోందనే సందేహం కలుగుతుంది. 

ఇదే సమయంలో నగరంలో శ్రీమంతుల కుటుంబానికి చెందిన శివారెడ్డి, అతని ప్రియురాలు ఆరుషి కారు ప్రమాదంలో చనిపోతారు. కానీ అది పక్కా ప్లాన్ తో చేసిన మర్డర్ అనే విషయం బయటపడుతుంది. ఆ కేసును ఛేదించడానికి కమిషనర్ బలరామ్ (మురళీశర్మ) ఆధ్వర్యంలో, వాసుదేవ్ (సంపత్ రాజ్) టీమ్ రంగంలోకి దిగుతుంది. పరిశోధనలో వారికి ఒక మిస్టీరియస్ డ్రగ్ దొరుకుతుంది. అదే విధంగా ప్రపంచంలోని పలు దేశాలలోని శ్రీమంతుల కుటుంబానికి సంబంధించిన ఆడవారు, దాదాపు ఒకే సమయంలో ఇండియాకి వచ్చి వెళుతున్నారనేది సంపత్ రాజ్ టీమ్ కి తెలుస్తుంది. 

ఇండోర్ లో సమంత అన్వేషణ .. అవుట్ డోర్ లో సంపత్ రాజ్ టీమ్ విచారణ మొదలవుతుంది. తన చుట్టూ ఏం జరుగుతుందన్నది తెలుసుకోవడానికి 'యశోద' ఏం చేస్తుంది? అప్పుడు ఆమెకి తెలిసే భయంకరమైన నిజాలు ఏమిటి? అక్కడి నుంచి బయటపడటానికి ఆమె చేసే ప్రయత్నాలు ఎలాంటివి? ఆరుషి మర్డర్ కేసుకు .. సమంత చిక్కుకున్న పరిస్థితులకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథ. ప్రేక్షకులను కదలనీయకుండా చేసే ప్రధానమైన అంశాలు కూడా ఇవే. 

దర్శకులు హరి - హరీశ్ ఇద్దరూ కూడా ఇంటర్నేషనల్ న్యూస్ ఐటమ్స్ ను ఆధారంగా చేసుకుని ఈ కథను తయారు చేసుకున్నట్టుగా చెప్పారు. చివర్లో అందుకు సంబంధించిన పేపర్ కటింగ్స్ కూడా వేశారు. అందువలన కథ చాలా సహజంగా అనిపిస్తూ .. కనిపిస్తూ ముందుకు వెళుతూ ఉంటుంది. నిదానంగా అడుగులు వేస్తూ .. ఆ తరువాత అడుగుల వేగం పెంచుతూ .. పరుగు అందుకున్న పధ్ధతితో ఈ కథను నడిపించారు. ఇంటర్వెల్ కి ముందు ట్విస్ట్ ఇచ్చి, ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచిన తీరు బాగుంది. 

సెకండాఫ్ లో మూడు నాలుగు అనూహ్యమైన ట్విస్టులతో కథను ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు. సమంత కిటికీలో నుంచి పావురం అందుకోబోతే అది అందనట్టుగా టీజర్ లో చూపించారు. అందులో పెద్ద విశేషం ఏముందిలే అని చాలామంది అనుకుని ఉంటారు. కానీ కరెక్టుగా ఆ సీన్ తోనే కథలో అసలు కదలిక మొదలవుతుంది. సమంతతో పాటు ఉన్ని ముకుందన్ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. రావు రమేశ్ .. మురళీశర్మ వంటి ప్రధానమైన పాత్రలను దర్శకులు తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. కథాకథనాలపై వారు గట్టి కసరత్తు చేశారనే విషయం అర్థమవుతుంది. 

ఇక ఇది సమంత సినిమా .. సమంత మాత్రమే చేయగలిగిన సినిమా అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇటు యాక్షన్ .. అటు ఎమోషన్ సీన్స్ లో యశోద తప్ప ఎక్కడా సమంత కనిపించదు. వేటకుక్క వెంటపడినప్పుడు ఒక గర్భిణీ స్త్రీగా .. నిస్సహాయురాలుగా .. ప్రాణాలు కాపాడుకోవాలనే తపనతో ఆమె పరిగెత్తే తీరు ఆమె నటనకు అద్దం పడుతుంది. ఇక యాక్షన్ సీన్స్ లోను సమంత ఎంత మాత్రం తడుముకోకుండా పెర్ఫెక్ట్ గా చేయడం ఆశ్చర్యపరుస్తుంది. కళ్లతో .. కరకు మాటలతో వరలక్ష్మి శరత్ కుమార్ విలనిజాన్ని పండించిన తీరు ఆకట్టుకుంటుంది. ఉన్ని ముకుందన్ తనకి ఇచ్చిన పాత్రను చాలా నీట్ గా చేశాడు.

'యశోద' ఒక కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్. ఈ కథలో ఎలాంటి డ్యూయెట్స్ గానీ .. రొమాన్స్ గాని .. కామెడీ గాని ఉండదు. ప్రేక్షకుడు అందుకు సిద్ధపడే వస్తాడు గనుక, వాటిని గురించి తెరపై వెతుక్కోడు. కథలో ప్రధానమైన అంశాలైన ఎమోషన్ -  యాక్షన్ కీ కనెక్ట్ అవుతూ వెళతాడు. ఎప్పటికప్పుడు ట్విస్టులతో ప్రేక్షకుడు థ్రిల్ ఫీలవుతూ ఉంటాడు. అక్కడక్కడా హాలీవుడ్ సినిమాల పోకడ కనిపించినప్పటికీ, ట్రీట్మెంట్ విషయంలో దర్శకులు కూర్చోబెట్టేస్తారు. ఒకవైపున ఇన్ డోర్ లో సమంత ట్రాక్ ను .. మరో వైపున మర్డర్ మిస్టరీని ఛేద్దించే ట్రాక్ ను అవుట్ డోర్ లో నడిపిస్తూ .. చివర్లో ఆ రెండు ట్రాకులను కలిపిన తీరు మెప్పిస్తుంది. అద్దంపై బొట్టుబిళ్లలు అంటిస్తూ .. ఆ బిల్డింగ్ మ్యాప్ ను యశోద సెట్ చేసుకోవడం హైలైట్ గా అనిపిస్తుంది.

కథాకథనాల పరంగా హరి - హరీశ్ మంచి మార్కులు కొట్టేస్తారు. తెరపై యశోదతో పాటు ప్రతి ఒక్క ప్రేక్షకుడు పరిగెడతాడు. అందుకు కారణం మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి సుకుమార్ అందించిన ఫొటోగ్రఫీ హైలైట్ అనిపిస్తుంది. ఎడిటింగ్ కి వంకబెట్టనవసరం లేదు. పాత్రల పరంగా చూసుకుంటే 'యశోద' చిన్న సినిమాగానే అనిపించినా, కంటెంట్ ను బట్టి .. నిర్మాణ విలువలను బట్టి చూసుకుంటే పెద్ద సినిమానే అనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది సమంత విశ్వరూపం .. ఎమోషన్ ను ఆయుధంగా చేసుకుని ఆమె సాగించిన విజృంభణం అని చెప్పచ్చు.


More Telugu News