రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులకు స్వేచ్ఛను ప్రసాదించిన సుప్రీంకోర్టు

  • రాజీవ్ హంతకులను విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సుముఖత
  • విడుదలకు సోనియా కుటుంబం కూడా సుముఖత
  • నళినితో పాటు జైలు నుంచి విడుదల కానున్న మరో ఐదుగురు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. నళినితో పాటు మరో ఐదుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. వీరిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇంతకు ముందే సుముఖతను వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ కు కూడా తెలియజేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన ఆదేశాలను జారీ చేసే సమయంలో కూడా గుర్తు చేసింది. వీరి విడుదలకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా సుముఖతను వ్యక్తం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎల్టీటీఈకి చెందిన ఒక మహిళా సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకోవడం ద్వారా రాజీవ్ ను హత్య చేశారు. ఈ కేసులో నళిని, శ్రీహరన్, శాంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, పెరారివాలన్ తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. వీరిలో పెరారివాలన్ కు గత మే నెలలో సుప్రీంకోర్టు స్వేచ్ఛను ప్రసాదించింది. ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో మిగిలిన దోషులు కూడా విడుదల కాబోతున్నారు. జస్టిస్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్నంలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.


More Telugu News