ఇన్ స్టా మూగది.. ఫొటోలు తప్ప ఏమీ లేదు.: కంగనా సంచలన వ్యాఖ్యలు

  • నిన్న ఏం రాశామో నేడు కనిపించదంటూ విమర్శ
  • తామేమి మాట్లాడామో అర్థం కాని వారికి సరైన వేదికని వ్యాఖ్య
  • ట్విట్టర్ గొప్ప సామాజిక వేదిక అంటూ ప్రశంస
ప్రముఖ బాలీవుడ్ నటి, సామాజిక అంశాలపై తరచుగా స్పందించే కంగనా రనౌత్ సామాజిక మాధ్యమైన ఇన్ స్టా గ్రామ్ ను పూచిక పుల్లతో సమానంగా తీసి పారేసింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాపై 2021 మే నెలలో నిషేధం పడిన విషయం తెలిసిందే. ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ చర్య ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆమె ఇన్ స్టా గ్రామ్ వేదిక ద్వారా తన వాణిని వినిపించాల్సి వస్తోంది. ఇదేమంత ప్రభావవంతమైనది కాదన్న అభిప్రాయాన్ని తాజాగా తన వ్యాఖ్యల్లో కంగనా వ్యక్తం చేసింది.

ఇన్ స్టాగ్రామ్ ను మూగబోయిన వేదికగా పేర్కొంది. ఇన్ స్టా అంతా ఫొటోల మయమేనన్న అభిప్రాయాన్ని వినిపించింది. అంతేకాదు ట్విట్టర్ ను ఉత్తమ సోషల్ మీడియా వేదికగానూ అభివర్ణించింది. మేధోపరంగా, సైద్ధాంతికంగా ప్రేరేపించేదంటూ వ్యాఖ్యానించింది. ట్విట్టర్ పాలసీ సమీక్ష తర్వాత నిషేధానికి గురైన వారిని అనుమతిస్తామంటూ ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటన చేయడంతో కంగనాలో కొత్త ఊపిరి వచ్చినట్టుంది. తాను తిరిగి ట్విట్టర్ పైకి రావాలని భావిస్తున్నట్టు ఆమె ఇప్పటికే ఆసక్తి వ్యక్తం చేసింది.

కంగనా రనౌత్ తాజా ఇన్ స్టా స్టోరీస్ పోస్ట్ ను పరిశీలిస్తే.. ‘‘మూగ ఇన్ స్టా గ్రామ్ అంతా ఫొటోలే. ఎవరైనా తమ అభిప్రాయం రాస్తే తదుపరి రోజు కనిపించదు. తాము క్రితం రోజు ఏం రాశామో చూసుకోకూడదని అనుకునే వారికి ఓకే. ఎందుకంటే వారు ఏం చెబుతున్నారో వారికే అర్థం కానప్పుడు అది అదృశ్యం కావాలి కదా. కానీ, మాలాంటి వారి పరిస్థితి ఏంటి? చెప్పే ఆలోచన డాక్యుమెంట్ అవ్వాలంటే, వాణిని లోతుగా వినిపించాలంటే?.. ’’ అంటూ ఆమె రాసుకొచ్చింది.


More Telugu News