ఓటమిని వెనకేసుకొచ్చిన సచిన్ టెండుల్కర్

  • నాణేనికి రెండు ముఖాలున్నట్టే జీవితం కూడా అంతేనన్న సచిన్
  • గెలుపు, ఓటములు కలసే ఉంటాయని కామెంట్
  • గెలుపును వేడుక చేసుకున్నప్పుడు, ఓటమినీ ఆమోదించాల్సిందేనని సూచన
టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలై, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టుకు లెజండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ బాసటగా నిలిచాడు. గెలుపు ఓటములు సహజమేనన్న రీతిలో అభిప్రాయాన్ని వినిపించాడు. ‘‘నాణేనికి రెండు ముఖాలు ఉంటాయి. జీవితం కూడా అంతే. మన జట్టు విజయాన్ని మనదిగా జరుపుకుంటున్నప్పుడు.. మన జట్టు ఓటములను కూడా అదే మాదిరి తీసుకోవాలి. జీవితంలో ఈ రెండూ ఒకదానితో ఒకటి కలసే ఉంటాయి’’ అంటూ సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశాడు.

భారత జట్టు ఘోర ఓమితో, కెప్టెన్ రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ తదితర ఆటగాళ్లను తప్పించాలంటూ అభిమానుల నుంచి డిమాండ్లు, విమర్శలు కురుస్తుండడం తెలిసిందే. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించొచ్చని, పాండ్యా కెప్టెన్సీ పగ్గాలు అందుకోవచ్చిన వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అయితే ఏకంగా టీమిండియాది అత్యంత చెత్త ఆటతీరు అంటూ విమర్శించాడు. ఈ తరుణంలో సచిన్ టెండుల్కర్ చేసిన ట్వీట్ అభిమానులను కొంత శాంతింపజేస్తుందేమో చూడాలి.


More Telugu News