ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా?.. అయితే, మళ్లీ అప్‌డేట్ చేసుకోవచ్చు!

  • ఉత్తర్వులు జారీ చేసిన యూఐడీఏఐ
  • గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రం సమర్పించి అప్‌డేట్ చేసుకోవాలన్న కేంద్రం
  • ఆధార్ పోర్టల్, ఆధార్ కేంద్రం నుంచి అప్‌డేట్ చేసుకోవచ్చని ప్రకటన
  • తప్పనిసరేమీ కాదని మరో ప్రకటన
ఆధార్ కార్డుకు సంబంధించి మరో అప్‌డేట్ ఇది. ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటితే మళ్లీ అప్‌డేట్ చేసుకోవాలంటూ విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆధార్ (ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్) రెగ్యులేషన్స్ 2016లో కొత్తగా 16ఎ నిబంధనను చేర్చింది. దీని ప్రకారం ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరు పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సీఐడీఆర్)లో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఈ ప్రక్రియ కారణంగా పౌరుల సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుందని యూఐడీఏఐ తెలిపింది. మై ఆధార్ పోర్టల్ లేదంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రం నుంచి ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 134 కోట్ల మంది ఆధార్ కార్డులను కలిగి ఉండగా, వీరిలో గతేడాది 16 కోట్ల మంది తమ కార్డులను అప్‌డేట్ చేసుకున్నారు.

పదేళ్లు దాటితే ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలంటూ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వార్తలను ఖండించిన ప్రభుత్వం.. ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరేమీ కాదని స్పష్టం చేసింది. అయితే, పదేళ్లుగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోని వారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేసినట్టు పేర్కొంది. విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ‘తప్పనిసరి’ అని ఎక్కడా పేర్కొనలేదని, ‘చేసుకోవచ్చు’ అని స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిపింది.


More Telugu News