తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

  • బీజేపీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని విమర్శ
  • ఎమ్మెల్యేల కొనుగోలుకు ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుందన్న కేజ్రీవాల్
  • ఢిల్లీలో 41 మంది ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని నిందితులు చెప్పారని వ్యాఖ్య
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేసిన ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. శాసన సభ సభ్యులను కొనుగోలు చేయాలని చూసి కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని విమర్శించారు. ఢిల్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనగోలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఒక్కొక్కరికి రూ. 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారని కేజ్రీవాల్ చెప్పారు. దీనికి తెలంగాణలో జరిగిన ఘటనే సాక్షం అన్నారు. హైదరాబాద్ ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యేలతో నిందితుల సంప్రదింపుల వీడియోను కేజ్రీవాల్ ప్రస్తావించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి తెలంగాణ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయారని అన్నారు. 

ఈ కేసులో నిందితులు ఢిల్లీలో 41 మంది ఎమ్మెల్యేలు తమ టచ్‌లో ఉన్నారని, ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇస్తామని చెప్పినట్టు వీడియోలో స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. ముగ్గురు వ్యక్తులు తెలంగాణ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర చూపుతున్నారని, ఎమ్మెల్యేలను అమిత్‌షాతో భేటీ చేయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 41 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొంటున్నామని, ఢిల్లీలో త్వరలోనే ప్రభుత్వం పడిపోబోతున్నదని నిందితులు చెప్పారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమున్నదని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.


More Telugu News