నాకౌట్ మ్యాచ్ ల్లో ఒత్తిడి గురించి వీళ్లకు తెలియదా?: టీమిండియా ఆటతీరుపై రోహిత్ శర్మ అసంతృప్తి

  • టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ దారుణ ఓటమి
  • నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన ఇంగ్లండ్ ఓపెనర్లు 
  • ఓటమి తీవ్ర నిరాశ కలిగించిందన్న రోహిత్
  • తమ ప్లాన్లు ఏవీ పనిచేయలేదని వెల్లడి
  • బట్లర్, హేల్స్ అద్భుతంగా ఆడారని కితాబు
టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇవాళ టీమిండియా ఓడిన తీరును సగటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు ఊదిపడేశారు. టీమిండియా బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. 

భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్... అందరూ ప్రతిభావంతులే అయినా, అడిలైడ్ లో నేడు ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. ఇంగ్లండ్ ఓపెనర్ల ఊచకోతకు బలయ్యారు. మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒంటరిగా కూర్చుని కళ్లు తుడుచుకుంటూ కనిపించడం ఎంత దారుణంగా ఓడిపోయారో చెబుతోంది. 

మ్యాచ్ ఫలితంపై రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఇంగ్లండ్ చేతిలో సెమీఫైనల్లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపాడు. బ్యాటింగ్ లో రాణించినా, బంతితో విఫలమయ్యామని అంగీకరించాడు. బౌలింగ్ లో అంచనాలను అందుకోలేకపోయామని వెల్లడించాడు. 

"నాకౌట్ మ్యాచ్ ల్లో ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఒత్తిడిని తట్టుకోవడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. మా జట్టులో ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారు... ఒత్తిడి గురించి వీళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో ఎన్నో మ్యాచ్ లు ఒత్తిడి నడుమ ఆడారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ప్రతి ఒక్కరినీ నేర్పలేం. ఎంతో ప్రశాంతంగా ఆడాల్సిన చోట ఒత్తిడితో ఆట మొదలుపెట్టాం" అని వాపోయాడు.

"ఈ మ్యాచ్ విజయం క్రెడిట్ ఇంగ్లండ్ ఓపెనర్లదే. బట్లర్, హేల్స్ చాలా బాగా ఆడారు. ఇవాళ మా ప్రణాళికలు ఏవీ ఫలించలేదు. వ్యూహాలు అమలు చేయలేకపోవడంతో కష్టాల్లో పడినట్టే. ఇవాళ అదే జరిగింది" అని రోహిత్ శర్మ వివరించాడు.


More Telugu News