మూడేళ్లుగా 2 వేల నోటు ముద్రించడమే లేదట!

  • మార్కెట్లో కనిపించని 2 వేల నోటు
  • 2019 లోనే ప్రింటింగ్ ఆపేసినట్లు ఆర్బీఐ వెల్లడి
  • ఆర్టీఐ దరఖాస్తు ద్వారా బయటపడ్డ సమాచారం
పెద్ద నోట్ల రద్దు తర్వాత అమలులోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోటును ప్రింట్ చేయట్లేదని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో 2 వేల నోటు ఒక్కటి కూడా ప్రింట్ చేయలేదని పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు ఆర్బీఐ ఇచ్చిన వివరాలలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 2 వేల నోట్లు ప్రింట్ చేయలేదని తెలిపింది. కొంతకాలంగా రూ.2 వేల నోటు చలామణిలో కనిపించడంలేదు. ఏటీఎంలలో కూడా రూ.500 వందలు, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. మార్కెట్లో రూ.2 వేల నోటు కనిపించడమే అరుదైపోయిందని పలువురు దుకాణదారులు చెబుతున్నారు.

పాత నోట్ల రద్దు తర్వాత 2016-17, 2018-19 సంవత్సరాలలో రూ.2 వేల నోట్లను ముద్రించినట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఈ నోట్లలో ఎక్కువ భాగం బ్యాంకుల వద్దే ఉన్నాయని, మార్కెట్లో అతి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయని సమాచారం. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం.. ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం నోట్ల విలువలో 2 వేల నోట్ల విలువ 2021 మార్చిలో 22.6 శాతం.. ఇది 2022 మార్చి నాటికి 13.8 శాతానికి తగ్గింది. ఇదే కాలానికి మార్కెట్లో ఉన్న మొత్తం నోట్లలో 2000 నోటు వాటా 1.6 శాతం మాత్రమేనని వెల్లడించింది. 

పెద్ద నోట్ల వల్ల నష్టమే ఎక్కువని తెలిసిరావడంతోనే ప్రభుత్వం వాటి ముద్రణను నిలిపివేసిందని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో 2 వేల నోటు ప్రింట్ చేయడమా? మానడమా? అనేదానిపై ఆర్బీఐ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. గతేడాది నోట్లను ముద్రించకపోవడంపై లోక్ సభలో కేంద్రం వివరణ ఇచ్చింది. పెద్ద నోట్ల ముద్రణ ఆపేయడం ద్వారా నల్లధనాన్ని అరికట్టవచ్చని, నకిలీ నోట్ల బెడద నుంచి తప్పించుకోవచ్చని పేర్కొంది.


More Telugu News