విజయసాయిరెడ్డి అల్లుడి అన్నను ఈడీ అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు?: పంచుమర్తి అనురాధ

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్
  • విజయసాయి అల్లుడి అన్నే శరత్ అన్న అనురాధ
  • మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని మండిపాటు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ అంశంపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ... ఈడీ అరెస్ట్ చేసిన శరత్ చంద్రారెడ్డి ఎవరో కాదని... ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి రైట్ హ్యాండ్, ఉత్తరాంధ్రలో వేల ఎకరాలను కబ్జా చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అల్లుడి అన్న అని చెప్పారు. 

ఇక శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. మద్య నిషేధంపై గొప్పలు చెప్పే జగన్ ఈ అరెస్ట్ పై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం అయిన తర్వాత అంచెలంచెలుగా మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. మూడున్నరేళ్లుగా శాండ్, మైన్, వైన్, ఇసుక, మద్యం, బియ్యం, అంబులెన్స్ మాఫియాలు నడిపిన జగన్ రెడ్డి వైద్య రంగం, ప్రజారోగ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. 

కోవిడ్ సమయంలో రోగులకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని జగన్ రెడ్డి ప్రజారోగ్యం కాపాడతారా? అని అనురాధ ఎద్దేవా చేశారు. చివరకు కోవిడ్ మరణాలపైనా తప్పుడు లెక్కలు చెప్పి కోట్లు స్వాహా చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదని దుయ్యబట్టారు. నిత్యం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తపించిన చంద్రబాబు గారికి, కోవిడ్ మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన నిధులనూ కొట్టేసిన జగన్ రెడ్డికి పోలికా? అని ప్రశ్నించారు. ఫోన్ చేయగానే కుయ్ కుయ్ మంటూ వస్తాయన్న అంబులెన్స్ ల జాడ లేక బిడ్డల శవాలను భుజాలపై వేసుకెళుతున్న ఘటనలు జగన్ రెడ్డికి కనిపించడంలేదా? అని అడిగారు. 

నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారాసిట్మాల్ కూడా దొరకని దుస్థితికి జగన్ రెడ్డి పాలనా వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. తెలుగు వారికి ఒక హెల్త్ యూనివర్సిటీ ఉండాలనే లక్ష్యంతో అన్న ఎన్టీఆర్ యూనివర్శిటీని తీసుకొస్తే దానిపైనా జగన్ రెడ్డి కక్ష కట్టారని అన్నారు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. మహనీయుల గొప్పతనం తెలియని మూర్ఖుడు జగన్ అని అన్నారు. మాట్లాడితే చాలు....వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయంటున్నారని... 175 సీట్లలో 7 వస్తాయో, 5 వస్తాయో తేల్చుకోండని ఎద్దేవా చేశారు.


More Telugu News