ఈ ఆహారంతో.. చలి ప్రభావం నుంచి రక్షణ

  • ఆకుపచ్చని కూరగాయలతో మంచి ఫలితాలు
  • నెయ్యి కూడా మంచి ఆప్షన్
  • రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది
  • దగ్గు, జలుబు వంటి వాటిని ఎదుర్కోవచ్చు
శీతాకాలం వచ్చిందంటే బద్ధకంగా అనిపిస్తుంది. ఎంతకీ నిద్ర చాలదన్నట్టు, ఇంకా కొద్ది సేపు నిద్రపోతే బావుండునని అనిపిస్తుంటుంది. శక్తి కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ కాలంలో శరీరానికి వేడి అవసరం. చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు, శరీరానికి వేడినిచ్చేందుకు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.

సూప్ లు
శీతాకాలంలో వేడి వేడి టీ లేదా కాఫీ తాగడం ఎంతో హాయినిస్తుందని తెలుసు. అలాగే, వేడి వేడి సూప్ లను కూడా ఈ కాలంలో తీసుకోవచ్చు. ఎందుకంటే విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు సూప్ తో లభిస్తాయి. పైగా వేడిగానూ ఉంటుంది. పిల్లలు కూరలు నచ్చకపోతే వాటిని గ్రైండ్ చేసి సూప్ గా చేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉండేందుకు అల్లం, దాల్చిన చెక్క పొడి, జీలకర్ర పొడి కలుపుకోవాలి. 

చిలగడదుంపలు
చల్లటి వాతావరణంలో చిలగడ దుంపలు (స్వీట్ పొటాటో) కూడా మంచి ఆహారం అవుతుంది. ఎందుకంటే వీటిల్లో విటమిన్ సీ, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. దీంతో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. 

డ్రై ఫ్రూట్స్
ఎండు ఖర్జూరాలు, బాదం పప్పు, వాల్ నట్, వేరు శనగలు కూడా తినాల్సిందే. వీటల్లో పోషకాలు దండిగా ఉంటాయి. వీటితో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. బాదంను పాలతో కలిపి తీసుకోవడం చలి ప్రభావాన్ని తగ్గిస్తుంది. నట్స్ (గింజల్లో)లో విటమిన్ సీ తగినంత ఉన్నందున రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. జలుబు, దగ్గు ప్రభావాలను అధిగమించొచ్చు. 

ఆకుపచ్చని కూరగాయలు
ఆకుపచ్చని రంగులో లభించే కూరగాయలను ఈ కాలంలో ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో పొటాషియం, విటమిన్స్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. పాలకూర, క్యాబేజ్ తదితర వాటిని తీసుకోవాలి. 

నెయ్యి
చలి ప్రభావాన్ని తట్టుకోవడంలో నెయ్యి పాత్ర కూడా ఉంటుంది. నెయ్యిని క్రమం తప్పకుండా తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్ఠంగా మారుతుంది. దీంతో చలి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చు. చర్మంలో తేమ శాతం పెరిగేందుకు కూడా తేనె సాయపడుతుంది. కాకపోతే అధికంగా తీసుకోకూడదు.


More Telugu News