కాసేపట్లో ఇంగ్లాండ్ తో కీలక సమరం... టీమిండియా ఫైనల్స్ కు చేరుకుంటుందా?

  • అడిలైడ్ లో జరగనున్న రెండో సెమీస్
  • ఇప్పటికే ఫైనల్స్ కు చేరుకున్న పాకిస్థాన్
  • మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్ లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇతర జట్ల కంటే మెరుగైన ప్రదర్శన చేసిన భారత్ కు ఈ మ్యాచ్ పెద్ద సవాల్ గానే చెప్పొచ్చు. టీ20 ఫార్మాట్ లో ప్రపంచ మేటి జట్లలో ఇంగ్లాండ్ కూడా ఒకటి కావడమే దీనికి కారణం. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్స్ కు చేరుకుంటుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఫైనల్స్ కు చేరుకుంది. దీంతో, భారత అభిమానులే కాకుండా పాకిస్థాన్ అభిమానులు సైతం ఇండియా ఫైనల్ కు చేరాలని కోరుకుంటున్నారు. ప్రపంచకప్ కోసం ఫైనల్స్ లో ఇండియా, పాక్ జట్లు తలపడాలని ఆకాంక్షిస్తున్నారు. 

మరోవైపు, ఈరోజు జరిగే మ్యాచ్ కు తుది జట్టులో ఎవరెవరు ఉంటారనే విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. కీపర్ స్థానంలో రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ లలో ఎవరిని ఎంపిక చేస్తారనేది కీలకంగా మారింది. ఇద్దరినీ ఆడించే అంశాన్ని టీమ్ మేనేజ్ మెంట్ పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీపైనే ఎక్కువ ఆశలున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కొంత కలవరపెడుతోంది. చిన్న జట్లపై విరుచుకుపడిన కేఎల్ రాహుల్ బలమైన ఇంగ్లండ్ పై ఎలా ఆడతాడో వేచి చూడాలి. మన పేస్ త్రయం షమి, భువి, అర్షదీప్ లు ఇప్పటి వరకు చక్కటి ప్రదర్శన చేశారు. 

ఇంగ్లాండ్ విషయానికి వస్తే పేపర్ పై బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కనిపిస్తోంది. అయితే ఈ టోర్నీలో ఈ జట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. ఏ బ్యాట్స్ మెన్ కూడా నిలకడగా ఆడలేదు. అయినప్పటికీ... ఇద్దరు, ముగ్గురు బ్యాట్స్ మెన్లు కుదురుకుంటే భారత్ కు ఇబ్బంది తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఆ జట్టు బౌలింగ్ కొంత బలహీనంగా ఉండటం మనకు కలిసొచ్చే అంశం.     

అడిలైడ్ లో జరగనున్న ఈ రెండో సెమీస్ కు వర్షం ముప్పు లేదు. వాతావరణం చాలా బాగా ఉంది. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో... టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.


More Telugu News