జడేజాను సీఎస్కే తోనే కొనసాగించాలని ధోనీ పట్టుదల?

  • అతడ్ని విడుదల చేయాలన్న ఆలోచనలో యాజమాన్యం
  • జట్టు ప్రయోజనాల రీత్యా జడేజాను కొనసాగించాలన్నది ధోనీ సూచన
  • 15వ తేదీ నాటికి విడుదల చేసే ఆటగాళ్ల వివరాలు ఇవ్వాల్సిందే
ఐపీఎల్ 2023కు సన్నాహాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. నవంబర్ 15 నాటికి 10 ఫ్రాంచైజీలు.. తమ దగ్గరున్న ఆటగాళ్లలో ఎవరిని విడిచి పెట్టాలని భావిస్తున్నాయో అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా వివిధ జట్లు విడుదల చేసిన ఆటగాళ్లు, కొత్త ఆటగాళ్లతో మినీ వేలాన్ని బీసీసీఐ డిసెంబర్ లో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 

ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేడాను కొనసాగిస్తుందా? లేక వదిలేస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గత సీజన్ లో సీఎస్కే జట్టు కెప్టెన్ అవకాశం జడేజాకు లభించింది. లీగ్ దశలో వరుస ఓటములతో అతడ్ని తప్పించి, తిరిగి ధోనీకే కెప్టెన్సీ పగ్గాలను యాజమాన్యం అప్పగించింది. దీంతో  జడేడా నిరాశకు గురయ్యాడు. 

ఆ తర్వాత సీజన్ లో మిగిలిన ఆటలకు ‘గాయం’ పేరు చెప్పి దూరమయ్యాడు. దీంతో జడేజాకు, సీఎస్కేకు మధ్య అంతరం వచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై అతడు మౌనంగానే ఉన్నాడు. కానీ, తన సామాజిక మాధ్యమాల పేజీల్లో సీఎస్కేకు సంబంధించి గత పోస్ట్ లను తొలగించడం వ్యవహారం గట్టిగానే బెడిసికొట్టిందన్న సంకేతాన్నిచ్చాడు.

ఈ క్రమంలో జడేజాను రిలీజ్ చేసి, వేరే ఆటగాడిని తీసుకోవాలన్నది సీఎస్కే యాజమాన్యం ఆలోచనగా తెలుస్తోంది. అయితే ధోనీ మాత్రం జడేజాను కొనసాగించాలని యాజమాన్యాన్ని కోరినట్టు సమాచారం. జట్టు ప్రయోజనాల రీత్యా అతడ్ని కొనసాగించాలని బలంగా సూచించినట్టు తెలుస్తోంది. 

గత సీజన్ కు రూ.16 కోట్ల భారీ మొత్తంతో జడేజాను సీఎస్కే అట్టిపెట్టుకోవడం తెలిసిందే. సీఎస్కేలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వాడిగా జడేజా గుర్తింపు పొందాడు. ఇక ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్ ను సైతం సీఎస్కే వదిలేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏ జట్లు ఏఏ ఆటగాళ్లను వదిలేస్తాయన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.


More Telugu News