ఇతర దేశాలతో మస్క్​ సంబంధాలపై అమెరికా డేగ కన్ను!

  • మస్క్ వ్యాపార సంబంధాలతో తమ జాతీయ భద్రతకు ముప్పును పరిశీలించాల్సి ఉందన్న అధ్యక్షుడు జో బైడెన్
  • సౌదీ అరేబియాకు చెందిన వారితో మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినట్టు వార్తలు
  • ఈ విషయంలో దర్యాప్తు అవసరం ఉందన్న బైడెన్
టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కు ఇతర దేశాలతో వున్న వ్యాపార సంబంధాలపై డేగ కన్ను వేయాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇతర దేశాలతో మస్క్ సంబంధాలు అమెరికా జాతీయ భద్రతా సమస్యలు తెచ్చిపెడతాయా? అనే కోణంలో పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. 

సౌదీ అరేబియాకు చెందిన వ్యక్తులతో కలిసి మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేయవలసి ఉందా? అని మీడియా ప్రశ్నకు అధ్యక్షుడు బిడెన్ స్పందించారు. ‘ఎలాన్ మస్క్ సహకారం, ఇతర దేశాలతో సాంకేతిక సంబంధాల విషయంలో ఆయన ఏవైనా అనుచిత పనులు చేస్తున్నారా? లేదా? దానిని పరిశీలించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను’ అని అన్నారు. 

మస్క్ గత నెలలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అయితే కంటెంట్ నియంత్రణ, గతంలో సస్పెండ్ చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లను పునరుద్దరించడంతో తమ రాబడిపై ఆందోళన వ్యక్తం చేసుకున్న ప్రకటన దారులు ట్విట్టర్ కు తమ ఖర్చులను నిలిపివేశారు. 

మరోపక్క, ట్విట్టర్‌ సహా మస్క్ పెట్టుబడి పెట్టిన కొన్ని వెంచర్‌లపై జాతీయ భద్రతా సమీక్షను ప్రారంభించడం గురించి అమెరికా ప్రభుత్వం చర్చిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అని వైట్ హౌస్ గత నెలలో పేర్కొంది.


More Telugu News