ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరబిందో ఫార్మా డైరెక్టర్ తో పాటు మరొకరి అరెస్ట్!

  • లిక్కర్ స్కామ్ విచారణలో దూకుడు పెంచిన ఈడీ
  • శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు అరెస్ట్
  • మూడు రోజుల విచారణ అనంతరం అరెస్ట్ చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి వరుసబెట్టి అరెస్టులు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ కేసు అలజడి రేపుతోంది. తాజాగా మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. వీరిలో శరత్ చంద్రారెడ్డితో పాటు మరో వ్యాపారి వినయ్ బాబు ఉన్నారు. శరత్ చంద్రారెడ్డి ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు. 

గత మూడు రోజుల నుంచి వీరిద్దరినీ ఢిల్లీలో ఈడీ విచారించింది. విచారణ ముగిసిన వెంటనే ఇద్దరినీ అరెస్ట్ చేసింది. మరోవైపు ఈ అరెస్టులపై ఈడీ స్పందిస్తూ వీరిద్దరికీ కోట్లాది రూపాయల విలువైన మద్యం వ్యాపారాలు ఉన్నాయని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్టు శరత్ చంద్రారెడ్డిపై అభియోగాలు ఉన్నాయని వెల్లడించింది. ఈడీ తాజా అరెస్టులు కలకలం రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకెంత మంది అరెస్ట్ అవుతారో అనే చర్చ జరుగుతోంది.


More Telugu News