ఇద్దరు బాలురతో కలిసి అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. తిరుపతిలో కలకలం

  • అదృశ్యమైన వారిలో నలుగురు పదో తరగతి, ఒకరు 9వ తరగతి విద్యార్థి
  • మరో విద్యార్థిని కూడా తమతో రమ్మని పిలిచిన వైనం
  • ఎక్కడికో చెబితేనే వస్తానని చెప్పడంతో అతడిని వదిలేసి వెళ్లిన విద్యార్థులు
  • వారి వద్దనున్న సెల్‌ఫోన్ల ఆధారంగా ట్రేస్ చేసేందుకు పోలీసుల యత్నం
తిరుపతిలో ఐదుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. అదృశ్యమైన వారిలో ముగ్గురు బాలికలు, ఒక బాలుడు ఉన్నారు. ఐదుగురిలో ముగ్గురు అమ్మాయిలు, అబ్బాయి పదో తరగతి చదువుతుండగా, మరో బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వీరు నిన్న పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత పదో తరగతి చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయి కలిసి 9వ తరగతి చదువుతున్న అబ్బాయి ఇంటికి వెళ్లారు. అతడితో ఏదో మాట్లాడిన తర్వాత ఐదుగురూ కలిసి 9వ తరగతి చదువుతున్న మరో బాలుడి వద్దకు వెళ్లారు. 

అతడిని కూడా తమతో రమ్మని పిలిచారు. అయితే, ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో చెబితేనే తాను వస్తానని బాలుడు చెప్పాడు. తమతో వస్తేనే చెబుతామని వారు చెప్పడంతో అతడు వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో అతడిని అక్కడే వదిలేసి ఐదుగురు కలిసి వెళ్లిపోయారు. అలా వెళ్లినవారు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. 

అయినా ఫలితం లేకపోవడంతో స్కూలు ప్రధానోపాధ్యాయుడితో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థుల వద్దనున్న సెల్‌ఫోన్ల ఆధారంగా వారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అలాగే, సీసీటీవీ కెమెరాలు, విద్యార్థులు సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు.


More Telugu News